పాకిస్తాన్ లో కొద్ది రోజులుగా పడుతున్న కుండపోత వర్షాలకు తోడు, హిమానీ నదాలు విరుచుకుపడటంతో పల్లెలు, పట్నాలు జలమయమయ్యాయి. ప్రకృతి సోయగాలతో కనువిందు చేసే ఖైభర్ పఖ్తుంఖ్వ, బలోచిస్తాన్ రాష్ట్రాల్లో ఉప్పొంగుతున్న నదులతో హృదయ విదారకమైన వాతావరణం నెలకొంది. వరదల ధాటికి ఇల్లు కోల్పోయిన లక్షల మంది ప్రజలు రోడ్ల వెంట గుడారాల్లో కాలం వెళ్లదీస్తున్నారు.
వరదల తీవ్రతకు 1500 మంది దాకా జలసమాధి అయ్యారు. కోటి మంది నిరాశ్రయులయ్యారు. వరద బాధితలకు ఆహారం, నీరు అందించడం ఆర్మీ, అధికార యంత్రాంగానికి శక్తికి మించిన పనిగా మారింది. పాకిస్థాన్‌లో మూడో వంతు భూభాగం వరదల్లో చిక్కుకుంది. పలు ప్రాంతాలకు మిగతా ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. పలు రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. యునిసెఫ్ దీనిని ‘భయంకరమైన విపత్తు’గా పేర్కొంది.
బలోచిస్తాన్, సింద్, ఖైభర్ పఖ్తుంఖ్వ, పంజాబ్ రాష్ట్రాల్లో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. హిమాలయాల కింద ఉత్తరాది ప్రాంతంలో కమ్యూనికేషన్, రవాణా వ్యవస్థ ధ్వంసం అవడంతో సహాయ చర్యలకు కష్టం అవుతోంది. 40 కి పైగా మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. 250 కీలక బ్రిడ్జిలు కనుమరుగయ్యాయి. రూ. లక్ష కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా గ్వదర్ ఓడరేవు వరకు చైనా నిర్మించిన కారాఖోరం హైవే కొండచరియలు విరిగిపడి మూసుకుపోయింది.
విమానాల ద్వారా తప్ప పొరుగు దేశాలు సాయం అందించలేని పరిస్థితి నెలకొంది. పంటలు పొలాల ఆనవాళ్లు కనిపించకుండా పోగా పశుసంపద తుడిచిపెట్టుకుపోయింది. దేశవ్యాప్తంగా సుమారు మూడు కోట్ల పైచిలుకు జనాభాపై ప్రభావం చూపగా… లక్షల మంది జీవితాలు ఆగం అయ్యాయి. దేశంలోని 15 శాతం జనాభా వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
వర్షాల వల్ల రహదారులు, పంటలు, ఇండ్లు, బ్రిడ్జ్‌లు, ఇతర మౌళిక సదుపాయాలు ధ్వంసం అయ్యాయి. సింద్ రాష్ట్రంలోని సెవాన్ పట్టణ సమీపంలో వరద బాధితులను తీసుకెళ్తున్న పడవ బోల్తాపడి 13 మంది చనిపోయారు.
2010లో వచ్చిన వరదల కన్నా ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉంది. 2010లో వరదల వల్ల దేశంలో రెండు వేల మందికిపైగా మరణించారు. సింద్, బలోచిస్తాన్ రాష్ట్రాల్లో వ్యవసాయం తీవ్రస్థాయిలో దెబ్బతిన్నది. దీంతో ఈసారి దేశంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడనుందని ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ప్రకటించారు.