ఏదో ఒక సాకుతో యుద్ధాలు, మిలిటరీ జోక్యాలు చేసుకోవటం సులభం కానీ వాటి నుంచి బయటపడటం అంత తేలిక కాదని గతంలో వియత్నాంపై ఫ్రాన్సు, అమెరికా జరిపిన యుద్ధాలు, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా మిత్రపక్షాల మిలిటరీ దాడులు స్పష్టం చేశాయి. అమెరికా మిలిటరీ కార్పొరేట్ లు అవసరమైతే తమ సైనికులను కొందరిని బలిపెట్టి లాభాలను పిండుకోవటమే పనిగా ప్రణాలికలు రచిస్తారు. ఇప్పటి వరకు అమెరికా గడ్డమీద ఎలాంటి యుద్దాలు జరగకపోవటం, ప్రత్యక్షంగా పర్యవసానాలను అనుభవించకపోవటంతో అక్కడి జనాలు కూడా యుద్ధాలను పెద్దగా పట్టించుకోవటం లేదు. పైగా ఆమోదిస్తున్నవారు ఉండటం ఆందోళనకరం.
ఆసియ ఖండంలోని వివిధ దేశాలలో పెద్ద సంఖ్యలో అమెరికా సైనిక కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటికి ధీటుగా చైనా కూడా తన బలాన్ని పెంచుకుంటున్నది. ఆసియాలో చిచ్చు పెట్టేందుకు పూనుకున్న అమెరికా తీరుతెన్నులకి నిరసనగా చైనా అనేక క్షిపణి పరీక్షలు జరిపింది, దాంతో చైనాను బెదిరించేందుకు అమెరికా 1996లో రెండు విమాన వాహకయుద్ధ నౌకలను తైవాన్ జలసంధికి పంపింది. దాని కొనసాగింపుగా 1997లో నాటి స్పీకర్ న్యూటన్ గింగ్‌రిచ్‌ను తైవాన్ పర్యటనకు పంపింది. ఇటీవలి నాన్సీ పెలోసీ మాదిరి అనుమతి లేకుండా గింగ్‌రిచ్ రాలేదు. చైనాతో ముందుగా సంప్రదించిన తరువాతే జరిగింది. నాన్సీ పెలోసీ రాక తరువాత తైవాన్ జలసంధిలో ఉద్రిక్తత నెలకొంది. చైనా – అమెరికాల యుద్ధ నౌకల మోహరింపు.. విమాన వాహకయుద్ద నౌకలను అనేక ఇతర నౌకలు, విమానాలతో డ్రిల్స్ యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తున్నాయి.
ఇప్పటికే ఉక్రెయిన్లో రష్యా మీద పరోక్ష దాడులు జరుపుతున్న అమెరికా ఒకేసారి చైనా మీదకు దిగే అవకాశం లేదన్నది నిపుణుల విశ్లేషణ. ఉక్రెయిన్ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగనుందనే సంకేతాలు, అమెరికాలో మాంద్య ప్రమాదం, పార్లమెంటు ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగలనుందనే విశ్లేషణల నేపధ్యంలో తాజా పరిణామాలు జరుగుతున్నాయి. బైడెన్ క్రమంగా తైవాన్ అంశం మీద ఒకే చైనా అన్న అంగీకృత విధానానికి తిలోదకాలిచ్చి…చైనాకు వ్యతిరేకంగా నాటో కూటమి మాదిరిగా ఆసియాలో మరో కూటమి ఏర్పాటు చేసేందుకు పధకం వేశారు.
నాలుగేండ్ల రెండవ ప్రపంచ యుద్దంలో సర్వనాశనమైన ఐరోపాలో… పునరుద్దరణ పేరుతో అమెరికా కుట్రలు అన్నీ ఇన్ని కావు. ఐరోపాకు సోవియట్ నుంచి ముప్పు ఉందనే ఉందనే బూచి చూపి నాటో కూటమి ఏర్పాటు చేసి దానికి ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకుంటున్న సంగతి జగమెరిగినదే. ఇప్పుడు ఉక్రెయిన్ నాశనానికి దానికి ఆయుధాలమ్మి సొమ్ము చేసుకోవటంతో పాటు దాని పునరుద్దరణ పేరుతో తన కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకు పావులు కదుపుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా చేసింది అదే తన కంపెనీలకే కాంట్రాక్టులు అప్పగించింది. అనేక యుద్ధాల అనుభవం చూసిన తరువాత తన పౌరుల ప్రాణాలను ఫణంగా పెట్టకుండా ఇతరులను బలితీసుకుంటూ ఆయుధాలమ్మి సొమ్ము చేసుకుంటోంది.
రెండవ ప్రపంచ యుద్ధం నుంచి 2001 వరకు ప్రపంచంలోని 153 ప్రాంతాల్లో అమెరికా పెట్టిన చిచ్చు, చేసిన యుద్దాలు 258గా లెక్కవేశారు. వీటన్నింటిలో అమెరికన్ కార్పొరేట్లకు లాభాలే వచ్చాయి. అందువల్లనే ప్రపంచంలో ఎక్కడైనా శాంతి ఉందంటే అమెరికాకు నిదరపట్టదు. వియత్నాంపై దాడిలో పెద్ద సంఖ్యలో అమెరికన్లు మరణించటంతో దానికి వ్యతిరేకంగా జనంలో తీవ్ర అసమ్మతి చెలరేగింది. దాంతో అప్పటి నుంచి తన చేతికి మట్టి అంటకుండా, తన పౌరులు మరణించకుండా మిత్రపక్షాల పేరుతో ఇతర దేశాలను దించుతోంది. కావాల్సిన పెట్టుబడులు పెడుతోంది, ఆయుధాలు అమ్ముకుంటోంది. ఇరాక్‌పై దాడిచేసి అక్కడి చమురు సంపదలపై పట్టు సంపాదించిన సంగతి తెలిసిందే. అదే ఎత్తుగడను ఇరాన్ మీద కూడా అమలు చేసేందుకు పూనుకొని ఎదురు దెబ్బలు తిన్నది. దాన్ని ఎలాగైనా తన దారికి తెచ్చుకొనేందుకు ఆంక్షల పేరుతో పరోక్ష దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తైవాన్ మీద చైనాను రెచ్చగొట్టటం వెనుక అనేక అంశాలున్నాయి. చైనా ఆయుధాల సత్తాను తెలుసుకోవటం, ఉక్రెయిన్ వివాదంలో రష్యాకు మద్దతు మానుకోవాలని బ్లాక్‌మెయిల్, తైవాన్ జలసంధిలో విన్యాసాలు ఖర్చుతో కూడుకున్నవి గనుక ఆర్ధికంగా నష్టపరచటం అమెరికా కుయుక్తులుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read : అమెరికా గన్ కల్చర్