కాకినాడ సమీపంలో ఏర్పాటు చేయతలపెట్టిన బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారు. బల్క్ డ్రగ్ పార్క్ వల్ల పర్యావరణానికి ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నీరు, నేల, వాయు, సముద్రం అన్నీ కలుషితం అవుతాయన్నారు.
కాకినాడ సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో ఈ తరహా పరిశ్రమ నెలకొల్పడం ద్వారా మత్స్యకారుల జీవనోపాధి దెబ్బ తింటుందని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సంయుక్త కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొన్నారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పరిశ్రమ ఏర్పాటును పక్కన పెట్టారని, దానికి విరుద్ధంగా సిఎం జగన్ బల్క్ డ్రగ్ పార్క్ ను అరబిందో కంపెనీ కి కట్టబెట్టేలా ప్రణాళికలు రచిస్తున్నారని ఆరోపించారు.
ఈ పార్క్ ఏర్పాటును ఇక్కడి స్థానికులు, మత్స్య కారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, వారి ఆందోళనను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాకినాడ జిల్లా తొండంగి మండలం కేపీ పురం, కోదాడ గ్రామాల పరిధిలో ఇది ఏర్పాటు కానుంది. బల్క్ డ్రగ్ పార్క్‌ను దక్కించుకునేందుకు మనతోపాటు తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు తీవ్రంగా పోటీ పడ్డాయి, చివరకు ఏపీకి ఆ అవకాశం కేంద్రం కల్పించింది.
Also Read : ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్: కేంద్రం ఆమోదం