సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు సుప్రీం కోర్టు ఈ రోజు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గుజరాత్ అల్లర్ల కేసులో అమాయకులను ఇరికించేందుకు తప్పుడు ఆధారాలు రూపొందించారన్న ఆరోపణలపై జూన్ 25న అరెస్టయ్యారు. ఈ కేసులో బెయిల్ కోసం తీస్తా చేసుకున్న దరఖాస్తుపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం.. ఆమెకు ఊరట కల్పించింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనం.. సాధారణ బెయిల్ పిటిషన్‌పై గుజరాత్ హైకోర్టు నిర్ణయం తీసుకునేంతవరకు పాస్‌పోర్ట్‌ను ట్రయల్ కోర్టు వద్ద సమర్పించాలని ఆదేశించింది. కేసు విచారణలో దర్యాప్తు సంస్థలకు సహకరించాలని స్పష్టం చేసింది.
ఈ కేసులో అహ్మదాబాద్ సెషన్స్ కోర్టు తీస్తా సెతల్వాద్‌కు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. గుజరాత్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం సహా, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారని జులై 30న న్యాయస్థానం పేర్కొంది. సెతల్వాద్‌తో పాటు గుజరాత్ మాజీ డీజీపీ శ్రీకుమార్‌లకు బెయిల్ నిరాకరించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఇరువురూ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారణ జరుపుతున్న గుజరాత్ హైకోర్టు.. ప్రత్యేక దర్యాప్తు బృందాని(సిట్)కి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 19న చేపట్టనుంది. ఈలోగా మధ్యంతర బెయిల్ కోసం తీస్తా సేతల్వాద్ సుప్రీంను ఆశ్రయించారు.