కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. రాహుల్ నిన్న 20 కిలోమీటర్ల మేర నడిచారు. కన్యాకుమారిలోని అగస్త్యేశ్వరం నుంచి నాగర్‌కోయిల్ వరకు యాత్ర సాగింది. ఉదయం 7 గంటల నుంచి గం. 10.30 వరకు, తిరిగి మధ్యాహ్నం గం. 3.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగింది.
కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు దారిపొడవునా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు చోట్ల ఆయన మాట్లాడారు. దేశానికి సేవ చేయాలన్న ఆసక్తి, ఉన్నత భావాలు ఉన్న యువత రాజకీయాల్లోకి రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
స్వాతంత్ర్య పోరాట సమయంలో గాంధీజీ సందర్శించిన సుచింద్రంలోని ఎస్ఎంఎస్ఎం హయ్యర్ సెకండరీ పాఠశాలను రాహుల్ సందర్శించారు. అలాగే, చిన్నారులకు సామాజిక కార్యక్రమాలు నిర్వహించే జవహర్ బాల్ మంచ్ సభ్యుల్ని కలిశారు. పెయింటింగ్‌లో ప్రతిభ చూపిన బాలలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ‘భారత్ జోడో’ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. పాఠశాలలో మొక్కను నాటారు. ఆ తర్వాత రైతు సమస్యలపై పోరాడుతున్న పౌర సమాజం సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
2017లో నీట్ పరీక్షలో విఫలమైనందుకు ఆత్మహత్య చేసుకున్న ఎస్.అనిత కుటుంబ సభ్యులు రాహుల్‌ను కలిసి నీట్‌ను రద్దు చేయాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అనిత తండ్రి, సోదరుడు మణిరత్నం కాసేపు రాహుల్ వెంట నడిచారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నీట్ పరీక్ష, కౌన్సిలింగ్ లో సంస్కరణలు తీసుకొస్తామని… నీట్ ను బలవంతంగా రాష్ట్రాలపై రుద్దే పని చేయబోమని ఈ సందర్భంగా రాహుల్ హామీ ఇచ్చారు.
Also Read: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర