తెలుగు ప్రజలు సంతోషంగా, సుఖంగా ఉండాలని కోరుకునే నాయకుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని, దివంగత నేత వైఎస్సార్, జగన్ లపై పరుష పదజాలం ఉపయోగించడం, వ్యక్తిగత దూషణలు చేయడం తెలంగాణ నేతలకు తగదని ఎమ్మెల్యే, ఏపిఐఐసి చైర్ పర్సన్ ఆర్కే రోజా హితవు పలికారు. రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, ఆ తర్వాత ప్రభుత్వానికి సంబంధం లేదని, వ్యక్తిగతంగా మాట్లాడామని తెలంగాణా మంత్రులు చెప్పడం సమంజసం కాదన్నారు రోజా.
ఆంధ్ర ప్రదేశ్–తెలంగాణా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న నీటి ప్రాజెక్టుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరమన్నారు. రాజకీయ విద్వేషాలకు ఆస్కారం ఉండకూడదని, సామరస్యంగా సమస్య పరిష్కారానికి సహకరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. విభజన సమయంలో తమ రాష్ట్రానికి కేటాయించిన నీటివాటాను దక్కనీయకుండా అన్యాయం చేయాలని చూస్తే సహించేదిలేదన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
విద్యుదుత్పత్తి పేరుతో ఆంధ్ర ప్రదేశ్ కు, ముఖ్యంగా కరువుతో అల్లాడే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు అన్యాయం చేయొద్దని చేతులెత్తి వేడుకుంటున్నట్లు రోజా వ్యాఖ్యానించారు. నీటి సమస్య క్యాబినెట్ సవివరంగా చర్చించి జోక్యం చేసుకోవాల్సిందిగా, ప్రధానమంత్రి మోడీ, జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లకు లేఖ రాసిందని, కేంద్రం వెంటనే స్పందించి ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని విజ్ఞప్తి రోజా విజ్ఞప్తి చేశారు.
శ్రీవారి అశీస్సులతోనే అనారోగ్యం నుంచి కోలుకున్నానని, అందుకే స్వామివారి దర్శనార్ధం వచానని రోజా అన్నారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.