అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అటవీ విశ్వవిద్యాలయము తెలంగాణ చట్టం,2022 ను నిన్న అసెంబ్లీలో ప్రవెేశ పెట్టగా, ఇవాళ అసెంబ్లీ, కౌన్సిల్ లో చర్చించి ఆమోదించారు. దేశంలోనే మొదటి సారిగా అటవీ విద్య కోసం ఒక యూనివర్సిటీని నెలకొల్పటం చారిత్రాత్మకం అని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని అభినందించారు. అడవుల రక్షణ, పచ్చదనం పెంపును తెలంగాణకు హరితహారం ద్వారా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలోనే ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తీసుకున్నారు.
2015 నుంచి ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతా కార్యక్రమంగా హరితహారం కొనసాగుతోంది. మిగతా సాంకేతిక విద్యలకు ధీటుగా అటవీ విద్యకు కూడా ప్రాధాన్యతను ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (FCRI) ను 2016లో నెలకొల్పారు. ఇప్పడు అదే కాలేజీ యూనివర్సిటీగా అప్ గ్రేడ్ అవుతోంది. హైదరాబాద్ సమీపంలో ములుగు వద్ద (సిద్దిపేట జిల్లా) అత్యాధునిక సౌకర్యాలు, ఆధునిక భవనాలతో పాటు అటవీ విద్యకు అవసరమైన అన్ని హంగులతో ఇప్పటికే క్యాంపస్ సిద్దంగా ఉంది.
అటవీ విశ్వ విద్యాలయం ముఖ్యమైన అంశాలు
అటవీ విశ్వవిద్యాలయానికి శాసన సభ, శాసన మండలి ఇవాళ ఆమోదం తెలిపింది. దేశ అటవీ విద్యలో ఇది చారిత్రాత్మక ఘట్టం.
“అటవీ విశ్వవిద్యాలయము (UoF), తెలంగాణ చట్టం, 2022″ దేశంలోనే మొట్టమొదటిది.
ప్రపంచంలో మూడవ అటవీ యూనివర్సిటీ. రష్యా, చైనా తర్వాత మూడవది భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థ ని అటవీ విద్య, పరిశోధన, విస్తరణ మరియు ఫలితాలను ప్రజలకు చేరువ కావడం కోసం ప్రపంచ స్థాయి సంస్థగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఈ దిశగా, అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థ, హైదరాబాద్‌ను పూర్తి స్థాయి “అటవీ విశ్వ విద్యాలయం(UoF)” గా ఈ క్రింది అంశాలతో ప్రత్యేక చట్టం ద్వారా రూపొందించాలని ప్రతిపాదించబడింది.
i. అటవీ వనరుల సంరక్షణ మరియు స్థిరమైన నిర్వహణ కోసం అర్హత కలిగిన అటవీ నిపుణులను తయారు చేయడం.
ii. పరిశోధనలను ప్రోత్సహించడం మరియు చెట్ల పెంపకానికి తగిన పద్ధతులను అభివృద్ధి చేయడం ద్వారా పరిశ్రమలు మరియు ప్రజల అవసరాలు తీర్చడం.
iii. వివిధ వ్యవసాయ-పర్యావరణ పరిస్థితులకు అనువైన వ్యవసాయ-అటవీ నమూనాలను అభివృద్ధి చేయడం, సంప్రదాయ అటవీ కార్యకలాపాలే కాకుండా, సహజ అడవులపై ఒత్తిడిని తగ్గించడం, వ్యవసాయ వర్గాల ఆర్థిక అభివృద్ధి మరియు పర్యావరణ పరిస్థితులను పెంపొందించడం.
iv. సారూప్య సంస్థలతో అనుబంధం మరియు భాగస్వామ్యం ద్వారా విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించు కోవడం.
v. పరిశోధనా ఫలితాలను రైతులకు విస్తరణ శిక్షణ ద్వారా అందించడాన్ని ప్రోత్సహించడం.
vi. అటవీ విశ్వ విద్యాలయం (UOF), తెలంగాణ” స్థాపన అటవీ శాఖ అవసరాలకు అనుగుణంగా శిక్షణ పొందిన అటవీ నిపుణులను తయారు చేస్తుంది
అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థను యూనివర్శిటీగా రూపొందించిన తర్వాత అదనంగా పీహెచ్‌డీ (PhD) కోర్సులు, పట్టన అటవీ వనాలు, నర్సరీ మేనేజ్‌మెంట్, అగ్రో ఫారెస్ట్రీ, గిరిజన జీవనోపాధి పెంపుదల, ఫారెస్ట్ ఎంట్రప్రెన్యూర్‌షిప్, క్లైమేట్ స్మార్ట్ ఫారెస్ట్రీ & ఫారెస్ట్ పార్క్స్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా మరియు సర్టిఫికేట్ కోర్సులు ప్రారంభించడానికి నిర్ణయించడమైనది.
ఫలితంగా, విద్యార్థుల సంఖ్య ప్రస్తుత సంఖ్య 366 కు అదనంగా 360 పెరిగి 726 కి చేరుతుంది. ఉద్యోగుల సంఖ్య ప్రస్తుత సంఖ్య 118 కు అదనంగా 92 పెరిగి 210 కి చేరుతుంది.
గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ గా ఉంటారు. ఛాన్సలర్ గారు వైస్ ఛాన్సలర్ ను నియమిస్తారు.
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం బహుముఖ విధానాల ద్వారా హరిత వనాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉంది. రాష్ట్రంలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం “తెలంగాణకు హరిత హారం” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.
ఇది ప్రభుత్వం యొక్క అత్యంత విజయవంతమైన కార్యక్రమాలలో ఒకటి మరియు భారతదేశం నలుమూలల నుండి, విదేశాల నుండి విస్తృతమైన ప్రశంసలు శిక్షణ పొందిన, అర్హతలు కలిగిన అటవీ నిపుణుల లభ్యత ఈ బృహత్తర కార్యక్రమాన్ని చాలా కాలంపాటు విజయవంతం చేయడంలో దోహదపడుతుంది.
తెలంగాణ ప్రభుత్వం “తెలంగాణకు హరిత హారం” కార్యక్రమం క్రింద ఇప్పటి వరకు 268.83 కోట్ల మొక్కలు నాటడం జరిగింది.
గత 8 సంవత్సరాలుగా ప్రభుత్వం యొక్క నిరంతర కృషి కారణంగా, రాష్ట్రంలో పచ్చదనం 7.7 % మరియు అటవీ విస్తీర్ణం 6.85 % పెరిగింది.
(మూలం: ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ (ISFR 2021), ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా)