ఓమారు గాంధీజీ దంతమొకటి రాలిపోయింది. దానిని మహదేవ దేశాయ్ తీసి పదిలపరిచారు. గాంధీజీ కుమారుడు దేవదాస్ గాంధీకి ఈ విషయం తెలిసింది. “అది నాకు చెందినది” అంటూ దేవదాస్ గాంధీ గొడవపడ్డారు. మహదేవ దేశాయ్ అది తనకేనంటూ వాదించారు.
ఇంతలో అక్కడికి వచ్చిన గాంధీజీ “దేని గురించి గొడవపడుతున్నారు?” అని అడిగారు.
మహదేవ దేశాయి ఆ పంటిని చూపించి దేవదాస్ గాంధీ తనకే దీనిపై హక్కు ఉందని, తనకిచ్చెయ్యాలని అడుగుతున్నాడని చెప్పారు.
“హక్కు విషయానికొస్తే అది మహదేవ్ దేశాయికే చెందుతుంది” అన్నారు గాంధీజీ.
కానీ మీ ఇద్దరికన్నా నాకు దీని మీద అన్ని హక్కులూ ఉన్నాయి. కనుక నాకివ్వు ఆంటూ గాంధీజీ ఆ దంతాన్ని మహదేవ్ దేశాయ్ నుంచి తీసుకున్నారు.
అనంతరం ఆయన దానిని ఎవరికి తెలియకుండా విసిరేశారు.
“గాంధీజీ జ్ఞాపకాలు” అంటూ దేవదాస్ గాంధీ రాసిన ఓ వ్యాసంలో ఈ ఉదంతాన్ని ప్రస్తావించినట్టు చదివాను. దేవదాస్ మోహన్ దాస్ గాంధీ 1900 మే 22న జన్మించారు. 1957 ఆగస్ట్ మూడున తనువు చాలించారు. గాంధీజీ నాలుగో కుమారుడు దేవదాస్ గాంధీ. దక్షిణాఫ్రికాలోని నటాల్ కాలనీలో పుట్టి పెరిగారు. తండ్రి జరిపిన ఉద్యమంలో ముమ్మరంగా పాల్గొన్న ఈయన చాలాసార్లు జైలుపాలయ్యారు. ప్రముఖ జర్నలిస్టుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన ఈయన హిందుస్థాన్ టైమ్స్ పత్రికకు సంపాదకుడిగా పని చేశారు. తమిళనాడులో 1918లో గాంధీజీ స్థాపించిన దక్షిణ భారత హిందీ ప్రచార సభకు తొలి ప్రచారక్ గా వ్యవహరించారు.
– యామిజాల జగదీశ్
Also Read :