ఏళ్ళ తరబడి ఆర్ధిక, సామాజిక అంశాల్లో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని, దీన్ని రూపుమాపడానికి నాంది పలికిన మొదటి నాయకుడు దివంగత నేత డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. పరిపాలనా వికేంద్రీకరణ అంశంపై శాసన సభలోస్వల్ప కాలిక చర్చను అయన ప్రారంభిస్తూ.. ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన నాటినుంచీ సీమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో రాయలసీమను అవమానకరంగా సీడెడ్ జిల్లాలు అని, దత్త మండలాలు అని పిలిచేవారని…. 1928వ సంవత్సరం నవంబర్ 17, 18 తేదీల్లో నంద్యాల లో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశాల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహనీయుడు చెలుకూరి నారాయణ రావు మాట్లాడుతూ దత్త మండలాలు అనే ఈ అవమానకర నామాన్ని మార్చి రాయలసీమ గా ప్రతిపాదించారని నాటి చరిత్రను భూమన వివరించారు.
నాడు వైఎస్, నేడు జగన్ హయంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికీ ప్రణాళికలు రచిస్తున్నారని చెప్పారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ, కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలనను ప్రజలకు చేరువ చేసిన సిఎం జగన్… మూడు ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి తీసుకు వచ్చారని చెప్పారు. గత ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐ వై ఆర్ కృష్ణా రావు రాసిన ఎవరి రాజధాని అమరావతి’ అనే పుస్తకంలో ముందుమాట రాసిన వడ్డే శోభనాద్రీశ్వరరావు మొదటిసారిగా ‘సామాజిక’ అనే అంశాన్ని ప్రస్తావించారని భూమన వెల్లడించారు. సిఎం జగన్ ప్రతిపాదిస్తున్న పరిపాలనా వికేంద్రీకరణను సంపూర్ణంగా బలపరుస్తున్నట్లు చెప్పారు.
Also Read : ‘మూడు’ పై సిఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్?