నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసమే ఆపరేషన్ పోలో పేరిట జరిగిన సైనిక చర్య జరిగినట్టయితే నిజాంను భారత ప్రభుత్వమే రాజ్ ప్రముఖ్ గా ఎందుకు నియమించింది? 1952 లో బూర్గుల రామకృష్ణా రావు నాయకత్వంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వానికి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్ ప్రముఖ్ హోదాలో ప్రమాణ స్వీకారం చేయించాడు. 1956 అక్టోబర్ 31 వరకు ఆయన హైదరాబాద్ రాష్ట్రానికి రాజ్ ప్రముఖ్ గా భారత ప్రభుత్వం కొనసాగించింది. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా రాజ్ ప్రముఖ్ గా కొనసాగమని ప్రధానమంత్రి నెహ్రూ కోరినా నిజాం ఆ పదవిని త్యజించి తన శేష జీవితాన్ని భారత ప్రభుత్వం ఇచ్చిన 50 లక్షల రాజ భరణంతోనే ముగించాడు.
హైదరాబాద్ సంస్థాన విలీనంపై నిర్ణయాలు చేసింది హోమ్ మంత్రి వల్లాభాయి పటేల్. పటేల్ వద్ద హోమ్ సెక్రటరీ గా పని చేసిన విపి మీనన్ రాసిన integration of Indian states పుస్తకంలో కూడా ఆయన integration of Hyderabad state అన్నాడే తప్ప liberation of Hyderabad state అనలేదు. అదే గోవా విషయంలో లిబరేషన్ ఆఫ్ గోవా అన్నారు. లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ అన్నారు. హైదరాబాద్ మీద జరిగింది సైనిక చర్య అయినా దాన్ని పోలీస్ యాక్షన్ అన్నారు. ఇది విలీనం/సమైక్యత (Integration) అన్న విషయంలో భారత ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. భారత ప్రభుత్వం అదే దృష్టితో చూసింది కాబట్టే నిజాంను రాజ్ ప్రముఖ్ గా నియమించడానికి సంకోచించలేదు.
విచిత్రం ఏమిటంటే .. ఆనాటి పోరాటంలో ఎటువంటి పాత్ర, భాగస్వామ్యం లేని వారు ఈ రోజు విమోచన పేరుతో గోల చేస్తున్నారని తెలంగాణ మేధావి వర్గం అంటోంది. పైగా సర్దార్ వల్లాబాయి పటేల్ బొమ్మను వాడుకుంటున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
-దేశవేని భాస్కర్