Sunday, September 29, 2024
HomeTrending Newsఎన్నికల వరకూ లాగుతారు:  కేశవ్

ఎన్నికల వరకూ లాగుతారు:  కేశవ్

తెలుగుదేశం పార్టీని తర్వాతి తరానికి (నెక్స్ట్ జనరేషన్) చేరువ చేసేందుకే నారా లోకేష్ పాదయాత్ర చేపడుతున్నారని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వెల్లడించారు. టిడిపి ప్రజల కోసం పనిచేసే పార్టీ అని… ప్రజల వాణిని బలంగా  పాదయాత్ర ద్వారా వినిపిస్తారని చెప్పారు. జనవరి 26నుంచి లోకేష్ పాదయాత్ర చేస్తున్నారంటూ వచ్చిన వార్తలపై కేశవ్ స్పందించారు. యాత్ర స్వరూప స్వభావాలు, ఎప్పటినుంచి అనేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు.  ఈసారి ఎన్నికలకు చాలా ముందుగానే చంద్రబాబు పార్టీ టిక్కెట్లు కేటాయించే అవకాశాలున్నాయని సూత్రప్రాయంగా తెలిపారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని దానిపై అవసరమైతే  రెండ్రోజులైనా సభలో చర్చిద్దామని ప్రభుత్వానికి కేశవ్ సవాల్ విసిరారు.  తన ప్రభుత్వంపై తానే తప్పుడు లెక్కలు చెప్పిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ నిలిచి పోతారని అభివర్ణించారు.  ఆర్ధిక విషయాల్లో పారదర్శక విధానాలు ఎందుకు పాటించడంలేదని ప్రశ్నించారు. ఆర్ధిక గణాంకాలు దొరకవని, ఇరిగేషన్ మీద ఎంత ఖర్చు పెట్టిందో తెలియదు, ఎక్సైజ్ ద్వారా, జీఎస్టీ ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో తెలియదని, ఆఖరుకు జీవోలు కూడా వెబ్ సైట్ లో కూడా పెట్టడం మానేశారని ఆరోపించారు.

అసత్య ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ అవే అసత్యాలను మరింత బలంగా అన్ని వేదికల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.  తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను బైటికి పంపి మరీ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారని కేశవ్ అన్నారు. ఉద్దేశ పూర్వకంగానే సభను తప్పుదోవ పట్టించారన్నారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి నిజంగా అంత బాగుంటే ఉద్యోగులకు జీతాలు  ఒకటో తారీఖున ఎందుకు ఇవ్వలేకపోతున్నారని, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వడానికి ఎందుకంత ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో చిన్న చిన్న బిల్లులు కూడా చెల్లించడం లేదని, ఉద్యోగుల పీఎఫ్, అంతిమ సంస్కార ఖర్చులకోసం ఇచ్చే డబ్బులు కూడా వాడుకున్నారని చెప్పారు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే… దుల్హన్ పథకాన్ని అమలు చేయాలంటే డబ్బులు లేవని హైకోర్టుకు చెప్పారని పయ్యావుల గుర్తు చేశారు.

ఉత్తరాంధ్రలో అధికార పార్టీ నేతలు చేసిన భూ కబ్జాలతో ప్రభుత్వంపై అక్కడ తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోందని, దాన్ని ఎడుర్కొనేందుకే ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిందని కేశవ్ అభిప్రాయపడ్డారు. ఏ వ్యవస్థలకు ఎలాంటి అధికారాలున్నాయో , ఎవరి పరిమితులు ఏమిటో రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పారని వ్యాఖ్యానించారు. రాజధాని నిర్ణయించే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదన్న విషయం రాజ్యాంగం చెప్పిందన్నారు. ఈ కేసును ఎన్నికల వరకూ లాగేందుకు అవసరమైన అన్ని కుయుక్తులూ ప్రభుత్వం పన్నుతుందని పయ్యావుల అనుమానం వ్యక్తం చేశారు.

Also Read: లోకేష్ వ్యాఖ్యలు అభ్యంతరకరం: విజయసాయి

RELATED ARTICLES

Most Popular

న్యూస్