పెగాసస్ వ్యవహారంపై హౌస్ కమిటీ నివేదిక కొండను తవ్వి ఎలుకను కాదు కదా చీమను, దోమను కూడా పట్టలేక పోయిందని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ఏదో చేసిందనే భావన కలిగించేందుకు కమిటీ చైర్మన్ భూమన ప్రయత్నించారని, ఆయన్ను చూస్తే జాలేసిందని, ఆయనపై ఎంత ఒత్తిడి ఉందో అర్ధమయ్యిందని, లేనిది ఉన్నట్లు చెప్పాలని అయన ప్రయత్నించారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక్క సభ్యుడు లేకుండానే పెగాసస్ పై హౌస్ కమిటీ వేశారని, చరిత్రలో ఇలాంటి హౌస్ కమిటీ ఉండబోదని వ్యాఖ్యానించారు. సహచర ఎమ్మెల్యేలతో కలిసి కేశవ్ మీడియాతో మాట్లాడారు.
ఎవరెవరికి ఏ పథకం ద్వారా లబ్ధి చేకూరిందో తెలుసుకుంటే డేటా చౌర్యం జరిగినట్లా అని కేశవ్ ప్రశ్నించారు. గూగుల్ కూడా ఈ వ్యవయారంపై తమ వద్ద ఎలాంటి ఆధారాలూ లేవని చెప్పిందని వెల్లడించారు. అసలు పెగాసస్ వ్యవహారం జరిగిందా లేదా అనే దానిపై ఒక్క పదం కూడా ఈ మధ్యంతర నివేదికలో లేదన్నారు. అసలు ఆ ఆరోపణలు నిజం కాదు కాబట్టే ఏమీ చెప్పలేకపోయారన్నారు.
జగన్ ప్రభుత్వం ఇప్పుడు డేటా చౌర్యం చేస్తోందని, ప్రభుత్వం ఇంటింటికీ వాలంటీర్లను పంపించి, ఆధార్ కార్డులు తీసుకుని… టిడిపి వారి ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపణలు గుప్పించారు. బాబు హయంలో ఎలాంటి డేటా చౌర్యం జరగలేదని కేశవ్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి దమ్ముంటే ఈ నివేదికతో పాటు ఈ మూడేళ్ళపాటు జరిగిన డేటా చౌర్యంపై కూడా సుప్రీం కోర్టు కమిటీకి వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read: తెలుగుదేశం పార్టీది వక్రీకరణ : సిఎం జగన్