ఇరాన్ లో హిజాబ్ వివాదంపై ఐక్యరాజ్యసమితి ఆ దేశ ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. హిజాబ్ పేరుతో మహిళల హక్కులు కాలరాస్తున్నారని యుఎన్ మానవ హక్కుల కమిషన్ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. మహ్స అమిని మరణం మానవహక్కుల ఉల్లంఘనగా పేర్కొంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై దాడులు చేస్తు భయానక వాతావరణం సృష్టిస్తున్నారని యుఎన్ ఆరోపించింది. నిరసనకారుల మృతిపై ఆందోళన వ్యక్తం చేసింది. మహిళా నిరసనకారుల పట్ల హింసాత్మక వైఖరి విడనాడాలని మానవ హక్కుల కమిషన్… ఇరాన్ ప్రభుత్వానికి సూచించింది.
మరోవైపు ఇరాన్‌లో దేశవ్యాప్తంగా చెలరేగిన అల్లర్లు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. హిజాబ్ తీసువేస్తూ.. జట్టు కత్తిరించుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా రాజధాని టెహ్రాన్ తో పాటు ఇతర నగరాల్లో కూడా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనల్లో పాల్గొంటున్నారు. వారం రోజులుగా చేస్తున్న అల్లర్లలో ఇప్పటివరకు సుమారు 31 మంది మృతిచెందారు. ఇరాన్ లో అమలవుతున్న చట్టాలు, పోలీసుల జులుంను వ్యతిరేకిస్తూ టెహ్రాన్ సహా 17 నగరాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఆరురోజులుగా నిరసనలు పెరుగుతుండటంతో ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ పై తీవ్రమైన ఆంక్షలు విధిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లను బ్లాక్ చేసింది. ఫేస్ బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, యూట్యూబ్, టిక్ టాక్ తో సహ మరికొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఇదివరకే బ్లాక్ చేయగా… ఇరాన్ ప్రజలు వాట్సాప్, ఇన్ స్టాను ఎక్కువగా వాడుతున్నారు. నిరసనలు మరింత పెరగకుండా ప్రభుత్వం సోషల్ మీడియాను బ్లాక్ చేసింది. కుర్దు యువతి 22 ఏళ్ల అమిని మహ్స అమిని తన కుటుంబ సభ్యులతో రాజధాని టెహ్రాన్ లో పర్యటిస్తున్న సమయంలో హిజాబ్ ధరించలేదని చెబుతూ.. మోరాలిటీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. మంగళవారం అరెస్ట్ చేసిన తర్వాత ఆమె కోమాలోకి వెళ్లింది. చికిత్స పొందుతూ.. శుక్రవారం మరణించింది. ఆమె మరణంతో ఇరాన్ వ్యాప్తంగా ఒక్కసారిగా ఆందోళనలు, నిరసనలు పెరిగాయి.
అమిని స్వస్థలం కుర్దిస్థాన్ రాష్ట్రంలో ఆందోళనలు మరింత తీవ్రంగా ఉన్నాయి. దీని రాజధాని సనందజ్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఈ రీజియన్‌లో పెద్దఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. కాగా.. టెహ్రాన్ నుంచి నిరసనలు రష్త్, మషాద్, ఇస్ఫహాన్ నగరాలకూ వ్యాపించాయి. అమిని మృతి మానవ హక్కులకు జరిగిన ఘోరమైన అవమానంగా అమెరికా అభివర్ణించింది. ఫ్రాన్స్ కూడా ఈ ఘటనను ఖండించింది. అమిని ఉదంతం.. ఇరాన్ ప్రభుత్వం.. ఆ దేశంలోని మైనారిటీలైన కుర్దులకు మధ్య మరోసారి ఉద్రిక్తతలకు కారణమయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశీలకులు చెబుతున్నారు.