Wednesday, September 25, 2024
HomeTrending Newsవిద్యార్థి పరిషత్ వెన్నుముక గుజ్జుల నర్సయ్య

విద్యార్థి పరిషత్ వెన్నుముక గుజ్జుల నర్సయ్య

ఒక శకం ముగిసింది. విద్యార్థి ఉద్యమాలను ముందుండి నడిపించిన ఒక ధృవ తార నేలరాలింది. ఏబీవీపీ ని ఆంధ్ర ప్రదేశ్ లో స్థాపించిన వారిలో అగ్రగన్యులు, విద్యార్థి పరిషత్ కు వెన్నుముకగా ఆరు దశాబ్దాల పాటు పనిచేసిన మహోన్నత వ్యక్తి, అధ్యాపకుడిగా వేలాదిమంది యువతకు స్ఫూర్తి ప్రదాత, ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు వెన్నుదన్నుగా వ్యవహరించిన సాహసి, దేశం కోసం, ధర్మం కోసం, జాతీయ పునర్నిర్మాణ మహా యజ్ఞం లో సమిధగా మారిన ఆదర్శమూర్తి ఇక లేరు. విద్యార్థులకు సమస్యలు ఎదురైనా, సంస్థలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడిన నేనున్నాను అంటూ పరిష్కారం చూపే వ్యవహార కర్త, ప్రతి హృదిలో దేశభక్తిని నూరిపోసే అద్భుత మేధ శక్తి గల సమాజ సేవకులు గుజ్జుల నర్సయ్య నేడు (24-09-2022) శివైక్యం చెందారు. గుజ్జుల నర్సయ్య నేటి జనగామ జిల్లా రఘునాధపల్లి మండలం మండెల గూడెం గ్రామంలో జన్మించారు.

శ్రీమతి గుజ్జుల శాంతమ్మ, రాజమల్లయ్య పుణ్య దంపతులకు జన్మించిన మూడవ సంతానం. ప్రాథమిక విద్యభ్యాసం మండెల గూడెం, ఖిలాశాపూర్ గ్రామాలలో సాగింది. ఆలేరులో ఇంటర్ చదివి హనుమకొండ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎమ్మే ఇంగ్లీష్ పూర్తి చేశారు. జూనియర్ కళాశాల అధ్యాపకులుగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. అనంతరం డిగ్రీ కళాశాల అధ్యాపకునిగా పదోన్నతి పొంది, తెలంగాణలోని అనేక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పని చేసి పదవీ విరమణ పొందారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన వీరికి ఇద్దరు అన్నలు, ఇద్దరు తమ్ములు, ఒక చెల్లెలు ఉన్నారు. వీరికి శ్రీమతి రాజమణితో వివాహం జరిగింది. ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు వీరి సంతానం. వీరి సంతానం అందరూ కూడా ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. తెలంగాణలో ఆరు దశాబ్దాలుగా అనేకమంది విద్యార్థి, యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. ఎవరికి సమస్య ఎదురై నర్సయ్య సార్ను కలిస్తే వారికి నేనున్నాను అంటూ సహాయం అందించే పరోపకారి వీరు. ఆధ్యాత్మిక, విద్యార్థి ఉద్యమాలలో వీరి పాత్ర ఎనలేనిది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, పరివార్ సంస్థల కార్యకర్తలపై నక్సలైట్లు దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేసినా, హత్యలు చేసిన వారి కుటుంబాలలో మనోధైర్యాన్ని నింపుతూ వారి వెన్నంటి ఉండేవారు గుజ్జుల నరసయ్య.

స్ఫూర్తివంతమైన ఉపన్యాసాలు ఇస్తూ విద్యార్థి, యువతలో చైతన్యం, స్ఫూర్తి, నర నరాన దేశభక్తిని పెంపొందించేవారు. తెలంగాణలో 1970- 2000 మధ్యకాలంలో ఏ విద్యార్థి అయినా గుజ్జుల నరసయ్య ప్రసంగాన్ని వినే ఉంటారు. ఎందుకంటే ప్రతి కళాశాలలో విద్యార్థుల స్వాగత సభలు గానీ, విద్యార్థుల వీడ్కోలు సభలు గానీ, ఉత్తమ విద్యార్థి అభినందన సభలుగానీ, పాఠశాలల వార్షికోత్సవ సభలలో గాని గుజ్జుల నరసయ్య ప్రసంగం తప్పకుండా ఉంటుంది. లక్షలాది మంది యువత, విద్యార్థుల మది లో వారి పేరు చిరస్మరణీయంగా ఉంటుంది. తెలంగాణలో సామాజిక, కుటుంబ, ఆర్థిక సమస్యలు, కళాశాలల భాగస్వాముల మధ్య ఉండే విభేదాల పరిష్కారం కోసం నరసయ్య సార్ను సంప్రదించేవారు. గుజ్జుల నరసయ్య అనేక మందికి పెద్దన్న లా వ్యవహరించేవారు. వీరి వద్దకు వచ్చే ఎలాంటి సమస్యకైనా సునాయసంగా పరిష్కారం చూపేవారు. గుజ్జుల నరసయ్య సమస్యకు పరిష్కారం చూపారంటే పరస్పర విరుద్ధ భావాలు గల నక్సలైట్లు గానీ, కమ్యూనిస్టులు గానీ నిజాయితీగ పరిష్కారం, తీర్పు చెప్పారని ప్రశంసించేవారు. విద్యార్థి పరిషత్ ఉద్యమాలు నిర్వహించినా, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినా వాటిని జయప్రదం చేయడంలో నరసయ్య కీలకపాత్ర వహించేవారు. 1987-1989 మధ్యకాలంలో రెండు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వీరు పని చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ కార్యవర్గ సభ్యులుగా, విభాగ్ ప్రముఖ్ గా, సంభాగ్ ప్రముఖ్ గా, బాధ్యతలు నిర్వర్తించారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పరివార క్షేత్రాలలోని వివిధ సంస్థలకు మార్గదర్శకులుగా వ్యవహరించారు. పదవీ విరమణ పొందిన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా పోటీచేసి ఓడిపోయారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పరివార క్షేత్రాలలోనే కాకుండా అనేక స్వచ్ఛంద, సామాజిక సేవా సంస్థలకు కూడా వీరు సేవలందించారు. 1980 దశకంలో నక్సలైట్ ఉద్యమాలు ఉధృతంగా సాగుతున్న సమయంలో, వారి సిద్ధాంతాలకు అడ్డు వచ్చిన వారిని హత్యలు చేస్తూ భయభ్రాంతులకు గురిచేసినా కూడా మొక్కవోని ధైర్యంతో కార్యకర్తలలో చైతన్యాన్ని, స్ఫూర్తిని, ధైర్యాన్ని నూరిపోసిన మహా వ్యక్తి, సేవా తత్పరులు, త్యాగశీలి గుజ్జుల నరసయ్య. ఇప్పుడు వివిధ రాజకీయ పార్టీలలో గుజ్జుల నరసయ్య శిష్యులు ఉన్నారంటే వారి సేవలు చిరస్మరణీయం. అనేకమందికి స్ఫూర్తి ప్రదాత వీరు ఇక లేరు అంటే నమ్మశక్యంగా లేదు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ… జ్ఞానం,శీలం, ఏకతలు విద్యార్థి యువతకు బోధిస్తూ తుది శ్వాస వరకు సంస్థ పనిలోనే ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్