Saturday, November 23, 2024
HomeTrending Newsకొండ లక్ష్మణ్ బాపూజీకి సిఎం కెసిఆర్ నివాళి

కొండ లక్ష్మణ్ బాపూజీకి సిఎం కెసిఆర్ నివాళి

బడుగు బలహీనవర్గాల కోసం, తెలంగాణ సాధన కోసం, తన జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ గర్వించే గొప్ప నేత అని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు అన్నారు. కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి (సెప్టెంబర్‌ 27) సందర్భంగా ఆయనకు సిఎం కెసిఆర్ ఘన నివాళి అర్పించారు. ఉద్యమకారుడిగా, ప్రజాస్వామిక వాదిగా, పీడిత ప్రజల పక్షపాతిగా, నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడుగా పలుపార్శ్వాలతో కూడిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శనీయమని, సిఎం కెసిఆర్ కొనియాడారు.

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నేపథ్యంలో, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో వారు చేసిన కృషిని, నిస్వార్థ సేవలను సీఎం స్మరించుకున్నారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటం లో పాల్గొంటూనే, చాకలి ఐలమ్మతో సహా పలువురు ఉద్యమకారులకు న్యాయవాదిగా సేవలందించారని గుర్తు చేసారు. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం, సహకార రంగాల పటిష్టత కోసం, తన జీవితకాలం కృషి చేసారని సిఎం తెలిపారు.
బహుజన నేతగా, నేతన్నలైన పద్మశాలీలను సంఘటితం చేసారని, తెలంగాణ కోసం నాడు తన మంత్రి పదవికి రాజీనామా చేసిన బాపూజీ స్పూర్తి, మలి దశ తెలంగాణ సాధన పోరాటంలో ఇమిడి వున్నదని సిఎం అన్నారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. రాష్ట్ర ఉద్యానవన విశ్వ విద్యాలయానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టి గౌరవించుకున్నామన్నారు. చేనేత రంగంలో ప్రతిభావంతులైన కళాకారులకు ఆయన పేరుతో అవార్డులను అందజేస్తూ, చేనేత కార్మికులైన పద్మశాలీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతున్నదని సీఎం అన్నారు. సబ్బండ వర్గాల అభివృద్ది సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తూ, కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు రాష్ట్ర ప్రభుత్వం కార్యరూపం ఇస్తున్నదని సిఎం కేసిఆర్ తెలిపారు.

Also Read : వీరవనిత ఐలమ్మకు సీఎం కేసీఆర్ నివాళి

RELATED ARTICLES

Most Popular

న్యూస్