Sunday, February 23, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్శంకుస్థాపనలు ఒక రికార్డ్‌: సజ్జల

శంకుస్థాపనలు ఒక రికార్డ్‌: సజ్జల

రాష్ట్ర వ్యాప్తంగా రెండ్రోజుల్లో జరిగిన ‘మెగా గ్రౌండింగ్’ (ఇళ్ల శంఖుస్థాపనలు) ఒక రికార్డ్‌ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గృహ శంకుస్థాపనల్లో లబ్ధిదారులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి తండ్రికి మించిన తనయుడని నిరూపించుకున్నారని ప్రశంసించారు. నాడు వైఎస్‌ఆర్‌ తలపెట్టిన గృహనిర్మాణం అసాధ్యం అనుకున్నామని​,  అకుంఠిత దీక్షతో నాడు ఇళ్ల నిర్మాణాన్ని సుసాధ్యం చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు జగన్‌ మరో ముందడుగు వేశారని, వైఎస్‌ఆర్‌ మరణం తర్వాత ఇళ్ల నిర్మాణాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.

నివాస యోగ్యం లేని ఇళ్లను నిర్మించి చంద్రబాబు చేతులు దులుపుకున్నారని సజ్జల దుయ్యబట్టారు. కానీ సీఎం వైఎస్‌ జగన్‌ ఒక యజ్ఞంలా ఇళ్ల నిర్మాణాలను చేపట్టారని తెలిపారు. రాష్ట్రంలోని 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు 25 వేల ఎకరాల ప్రైవేట్‌ ల్యాండ్‌ కొని పేదలకు ఇళ్లు ఇవ్వడం జరిగిందని చెప్పారు. వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేశామని, నేడు ప్రతి లబ్ధిదారుడి కళ్లలో నిజమైన ఆనందం కనబడుతోందని తెలిపారు. ఇళ్ల స్థలాలపై కొన్ని పత్రికలు వక్రీకరించి వార్తలు రాస్తున్నాయని సజ్జల మండిపడ్డారు. విషం కక్కుతూ సీఎం జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి విష పత్రికలను ప్రజలెవరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. జగనన్న కాలనీల వల్ల చాలామందికి పరోక్ష ఉపాధి దొరకుతోందని,15 లక్షల ఇళ్ల నిర్మాణం వల్ల లక్షలాదిమందికి పని సృష్టించబడుతుందన్నారు. కరోనా సమయంలో దాదాపు 16 లక్షల పనిదినాలు కల్పించడం జరిగిందని సజ్జల వెల్లడించారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్