రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన వికేంద్రీకరణకు మద్దతుగా ఈ నెల 15న విశాఖలో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. మూడు రాజధానులకు మద్దతుగా విశాఖలో నేడు జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసి) సమావేశం జరిగింది. దీనిలో మంత్రి అమర్నాథ్ తో పాటు ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాసరావు, కరణం ధర్మశ్రీ, ప్రజా సంఘాల నేతలు, మేధావులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ఆకాంక్షను బలంగా చాటి చెప్పాలని, నాన్ పొలిటికల్ జేఏసి, ఏర్పాటు చేయాలని, ప్రతి మండలంలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేయాలని జేఏసి తీర్మానించింది. తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యేలు ధర్మశ్రీ, అవంతి ప్రకటించారు.
ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ…. విశాఖ పాలనా రాజధానికి అనుకూలంగా చేపట్టబోయే ఉద్యమం ఓ ఉప్పెనలా సాగాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. నేటి నుంచి 15వరకూ మండల, నియోజకవర్గ కేంద్రాల్లో విస్త్రతంగా సమావేశాలు, ర్యాలీలు చేపడతామని, ఆ తర్వాత విశాఖలో 15న అంబేద్కర్ విగ్రహం నుంచి భారీ ర్యాలీ ఉంటుందని చెప్పారు. మేధావులు, కళాకారులు వికేంద్రీకరణకు మద్దతుగా ప్రజలకు అవగాహన కలిగించాలని కోరారు.
అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో పరిమితమైతే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని, అమరావతికి అన్యాయం చేస్తామని తాము ఎక్కడా, ఎప్పుడూ చెప్పలేదని అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సమైఖ్య రాష్ట్రంలో కూడా అభివృద్ధి అంటా ఒకే చోట కేంద్రీకరించడం వల్లే విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని, అలాంటి తప్పు మళ్ళీ చేయడం సరికాదన్నారు. ఉమ్మడి ఏపీలో కూడా హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం విశాఖ అని అన్నారు. అమరావతితో పాటు విశాఖ, కర్నూలు కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఉత్తరాంధ్ర ఉనికి కాపాడేందుకు అన్ని వర్గాలతో కలిసి ఉద్యమం చేయడానికి జేఏసి కృషి చేయాలని సూచించారు. అవసరమైతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని అవంతి ప్రకటించారు.