మహిళల ఆసియా కప్ టి20 ఫైనల్లో ఇండియా- శ్రీలంక తలపడనున్నాయి. నేడు జరిగిన మొదటి సెమీ ఫైనల్లో థాయ్ లాండ్ పై ఇండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం శ్రీలంక- పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన రెండో సెమీఫైనల్లో లంక ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగు పెట్టింది. మ్యాచ్ చివరి బంతి వరకూ నరాలు తెగే ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరి బంతికి విజయానికి మూడు పరుగులు అవసరం కాగా పాక్ బ్యాట్స్ వుమన్ నిదా దార్ ఒక పరుగు చేసి రెండో పరుగు వద్ద రనౌట్ కావడంతో లంక గెలుపు సాధ్యమైంది. దాయాది ఇండియాతో ఫైనల్ పోరు ఆడాలన్న పాకిస్తాన్ ఆశలు విఫలమయ్యాయి.
శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మాధవి-35; అనుష్క సంజీవని-26; నిశాంక డిసిల్వా-14; హాసిని పెరీరా-13 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 122 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో నష్రా సందు మూడు; సాదియా ఇక్బాల్, నిదా దార్, యెమెన్ అన్వర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
పాకిస్తాన్ ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. మూడు ఓవర్లలోనే 30 పరుగులు రాబట్టింది. ఓపెనర్ మునీబా అలీ 10 బంతుల్లోనే 3 ఫోర్లతో 18 పరుగులు చేసి రనౌట్ గా వెనుదిరిగింది. కెప్టెన్ బిస్మా మరూఫ్ 42 పరుగులతో రాణించింది. చివరి 4 ఓవర్లలో 22 పరుగులు కావాల్సిన తరుణంలో లంక బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో పరుగులు చేయకుండా పాక్ బ్యాట్స్ విమెన్ ను నిలువరించారు. దీనితో చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా ఏడు పరుగులు మాత్రమే పాక్ చేయగలిగింది.
లంక బౌలర్ ఇనోకా రణవీరకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.