సత్యదేవ్ మంచి ఆర్టిస్ట్ .. కాకపోతే ఆయనకి పడాల్సిన పాత్రలు పడలేదనే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. హీరోగా ఏవో సినిమాలు చేస్తున్నప్పటికీ, ఆ సినిమాల ద్వారా ఆయన ఆశించిన స్థాయి క్రేజ్ మాత్రం రావడం లేదు. సరైన బ్రేక్ కోసం ఆయన వెయిట్ చేస్తుండగా, ఆయనకి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలోని ‘జయదేవ్’ పాత్రకి ఆయనను చిరంజీవి సిఫార్స్ చేయడం విశేషం. ఆ పాత్రకి ఆయనైతేనే కరెక్టుగా ఉంటాడని చిరంజీవినే స్వయంగా చెప్పడం విశేషం. మెగాస్టార్ వైపు నుంచి సత్యదేవ్ కి అంత సపోర్ట్ ఉండటం వల్లనే, ఆయన భార్యగా కనిపించడానికి నయనతార ఒప్పుకుందనే వారు లేకపోలేదు.
‘గాడ్ ఫాదర్’లో ప్రత్యేకమైన పాత్రను పోషించిన సల్మాన్ సంగతి అటుంచితే, చిరంజీవి .. నయనతార మధ్యలో ఆ స్థాయి ప్రాధాన్యత కలిగిన పాత్రలో సత్యదేవ్ కనిపించాడు. భార్య పట్ల అతి అనురాగం చూపిస్తూనే, ఒక వైపున మామగారి సీఎం సీటుపైన .. మరో వైపున మరదలి అందచందాలపైన మనసు పారేసుకున్న పాత్రలో సత్యదేవ్ నిజంగానే అదరగొట్టేశాడు. ఈ కథకి కావలసిన విలనిజం ఆయన పాత్ర వైపు నుంచే దొరుకుతుంది. మెగాస్టార్ తన ఇమేజ్ కి భిన్నంగా చేసినప్పటికీ, ఈ సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి భారీ వసూళ్లను రాబడుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 8 రోజుల్లోనే 145 కోట్లకి పైగా వసూలు చేసినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నిన్న ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ స్టేజ్ పై సత్యదేవ్ మాట్లాడుతూ, “అన్నయ్య వలన ఈ సినిమాలో అవకాశం రావడం .. అన్నయ్యతో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో నేను చాలా బాగా చేశానని అంతా అభినందిస్తుంటే సంతోషంగా ఉంది. అన్నయ్య నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే అనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read : నా కల నేరవేరింది : సత్యదేవ్