పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ పిలుపునిచ్చిన విశాఖ గర్జన ర్యాలీకి జనం పోటెత్తారు. వర్షం సైతం లెక్క చేయకుండా వచ్చిన అభిమానులు, మద్దతుదారులతో విశాఖ జనసంద్రమైంది. నగరంలోని ఎల్‌ఐసీ భవనం సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమైన విశాఖ గర్జన ర్యాలీ.. బీచ్ రోడ్డులోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు కొనసాగింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి తరలి వచ్చిన నేతలు ముక్తకంఠంతో వికేంద్రీకరణకు మద్దతు పలికారు. విశాఖ గర్జనకు కోస్తా, రాయలసీమ ప్రాంతానికి చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు కూడా జైకొట్టారు.
ఉత్తరాంధ్రవైపు చూడాలంటేనే చంద్రబాబు భయపడాలన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. పెట్టుబడిదారుల కోసం ఉద్యమాలు ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబుకు పదవిపైన, కుమారుడిపైనే ప్రేమ ఉంటుందన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటను రూపుమాపేందుకే విశాఖ రాజధాని అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యమన్నారు. ఆస్తుల సంపాదనే చంద్రబాబు ధ్యేయమని ఆరోపించారు. మహిళలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
విశాఖకు రాజధానిని సాధించేందుకు ఎంతవరకైనా పోరాడతామన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. విశాఖలో అరిస్తే అమరావతికి వినపడాలన్నారు. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాజధాని కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. రాజధానిపై పవన్ తీరు దురదృష్టకరమన్నారు మంత్రి రోజా. పవన్‌కు పాలిటిక్స్, యాక్టింగ్‌లకు విశాఖ కావాలి రాజధానిగా అవసరం లేదా అని ప్రశ్నించారు. తాము చేసేది ప్రజా పోరాటమనీ.. చంద్రబాబు చేసేది రియల్ ఎస్టేట్ పోరాటమని ఆరోపించారు మంత్రి రోజా.
పాదయాత్ర పేరుతో ఉత్తరాంధ్రపై అమరావతి రైతులు దండయాత్ర చేస్తున్నారని జేఏసీతో పాటు ఉత్తరాంధ్ర నేతలు ఆరోపించారు. దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ఎంతో వెనుకబాటుకు గురైంది. ఇంకా నష్టపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు.
Also Read : ఉనికి చెప్పేలా విశాఖ గర్జన: మంత్రి గుడివాడ