విశాఖ నుంచి కదిలి వెళ్ళేది లేదని భీష్మించిన పవన్ కళ్యాణ్ ఎందుకు వెనుదిరిగి వెళ్లిపోయారని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. పవన్ కు చంద్రబాబు ప్రయోజనాలే ముఖ్యమని అందుకే విశాఖ టూర్ పెట్టుకున్నారని, రాజకీయాల్లో విలువలు, నిబద్ధత లేని వ్యక్తీ అని తీవ్రంగా మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో పేర్ని మాట్లాడారు. ఉడత వూపులకు, తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదన్న పవన్ వ్యాఖ్యలకు నాని కౌంటర్ ఇచ్చారు. ‘మీ సినిమా డైలాగులకు, ఎవడో రాసిస్తే చదివే దబాయింపులకు వైసీపీలో బాల కార్యకర్త కూడా దడవడు’ అన్నారు. పవన్ రాజకీయ నాయకుడా, లేక ఫ్యాక్షన్ ముఠా నడుపుతున్నారా అని నిలదీశారు.
అమరావతి అనేది చంద్రబాబు దోపిడీకి ఆలవాలమని గతంలో దాదాపు అన్ని పార్టీల నేతలూ విమర్శలు చేశారని, ఇది అందరి రాజధాని కాదని అన్నారని, కానీ ఇప్పుడు అందరూ మాట మార్చారని…. దీనిపై ఉత్తరాంధ్ర ప్రజలు ఆవేదన చెందుతున్నారని నాని అన్నారు. ఇక్కడినుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాదయాత్రగా వెళ్లి ఉత్తరాంధ్రకు రాజధాని వద్దని చెబుతుంటే వారు ఒక జేఏసిగా ఏర్పడి ఒక సమావేశం పెట్టుకున్నారని వివరించారు. చంద్రబాబు లాగా అధికారం ఉంటే ఒకలాగా, లేకపోతే మరోలా ఉండడం సిఎం జగన్ తత్వం కాదన్నారు. నిబద్ధత, నిలకడ లేని రాజకీయ నాయకుడు పవన్ అని, నీటిమీద రాతలకు, పవన్ మాటలకు ఏమాత్రం తేడా లేదని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేన కార్యకర్తలు విశాఖ ఎయిర్ పోర్ట్ లో దాడికి ముందే సిద్ధమై వచ్చారని నాని ఆరోపించారు. బిసి, ఎస్సీ, మహిళా మంత్రులపై అసభ్య పదజాలంతో దూషిస్తూ, దాడికి పాల్పడ్డారని… సభ్య సమాజం కోసమైనా.. తన పార్టీ కార్యకర్తలు తప్పు చేశారని పవన్ పశ్చాత్తాపం వ్యక్తం చేయలేకపోయారని నాని ధ్వజమెత్తారు. తన అన్న చిరంజీవి అని చెప్పుకోలేక తన తండ్రి కానిస్టేబుల్ అని చెప్పుకుంటున్నారని, పవన్ ఏ ఊరు వెళ్తే అక్కడ తన తండ్రి పని చేశారని చెబుతుంటారని, అసలు ఎక్సైజ్ కానిస్టేబుల్ అంటే జిల్లా దాటి ట్రాన్స్ ఫర్ చేయరనే విషయమ పవన్ తెలుసుకోవాలన్నారు.