రాష్ట్రంలోని రైతాంగం ఈ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. వ్యవసాయ రంగానికి సిఎం జగన్ అన్యాయం చేస్తున్నారని, ఉత్తుత్తి హామీలతో మభ్య పెడుతున్నారని ఆరోపించారు. పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల గ్రామంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.
2024లో గాని, జగన్ భయపడి ముందు ఎన్నికలు జరిపినా గానీ వైసిపిని ప్రజలు భూస్థాపితం చేస్తారని…. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని, రాష్ట్రాన్ని దేశంలోనే ఓ అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని బాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల కోసం పోరాడుతుంటే కేసులు పెడుతున్నారని, పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నేతలపైనా కేసులు పెట్టారని, అందుకే తాను నిన్న పవన్ వద్దకు వెళ్లి సంఘీభావం తెలియజేశానని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ విశాఖ పట్నం వెళ్లే హక్కులేదా? మీ దోపిడీ, కబ్జాలు బయటపడతాయి అని పవన్ ను అడ్డుకున్నారాఅని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ద రైతులను ఆదుకోవడంపై పెట్టాలని బాబు సూచించారు. టిడిపి కార్యాలయంపై దాడి చేసి ఏడాది దాటినా, ఇప్పటికీ చర్యలు లేవని, డిజిపి సమాధానం చెప్పగలరా అని డిమాండ్ చేశారు. తాటాకు చప్పుళ్లకు, అక్రమ కేసులకు, దాడులకు నేను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Also Read : పవన్ కు చంద్రబాబు సంఘీభావం