కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డికి పదోన్నతి లభించింది. సాయంత్రం జరిగే విస్తరణలో అయన క్యాబినెట్ ర్యాంక్ మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. పదోన్నతి పొందుతున్న మంత్రులు, కొత్తగా క్యాబినెట్ లో చేరుతున్న మంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ భేటిలో అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. సహకార రంగాన్ని బలోపేతం చేసే దిశలో కసరత్తు చేస్తున్న కేంద్రం దీనికోసం ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కీలకంగా భావిస్తున్న ఈ శాఖను కిషన్ రెడ్డికి అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాల్లో సహకార రంగానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసిన ప్రెస్ నోట్ ను షేర్ చేశారు. దీనితో ఆయనే ఈ శాఖను నిర్వహించబోతున్నారని భావించవచ్చని తెలుస్తోంది.
సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు కిషన్ రెడ్డి, యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా, రాష్ట్ర పార్టీ కోశాధికారి, ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వర్తించారు. ¬2004 లో హిమాయత్ నగర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కిషన్ రెడ్డి ఆ తర్వాతా 2009, 2014 ఎన్నికల్లో అంబర్ పేట నుంచి గెలుపొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అతి స్వల్ప తేడాతో ఓటమి పాలైన కిషన్ రెడ్డి 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. కేంద్రంలో అత్యంత కీలకమైన హోం శాఖలో సహాయ మంత్రిగా ప్రస్తుతం బాద్యతలు నిర్వహిస్తున్నారు.