టి20వరల్డ్ కప్ లో శ్రీలంక సూపర్-12లో బెర్త్ ఖాయం చేసుకుంది. నేడు జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై 16 పరుగులతో విజయం సాధించింది. నెదర్లాండ్స్ ఓపెనర్ మాక్స్ ఒదౌద్ అజేయమైన 71 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు, కానీ మిగిలిన బ్యాట్స్ మెన్ నుంచి సరైన సహకారం లేకపోవడంతో ఓటమి తప్పలేదు. మరోవైపు శ్రీలంక ఓపెనర్ కుశాల్ మెండీస్ రాణించి 79 పరుగులు చేయగా, బౌలర్లు సమిష్టిగా రాణించి విజయం అందించారు.
జీలాంగ్ లోని సైమండ్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కుశాల్ మెండీస్ 44బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 79; అసలంక-31; భానుక రాజపక్ష -19 పరుగులతో రాణించారు. నిర్ణీత 20ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ మెకెరన్, బాస్ లేదే చెరో రెండు; ఫ్రెడ్ క్లాసేన్, వాన్ డెన్ గుగ్టీన్ చెరో వికెట్ పడగొట్టారు.
నెదర్లాడ్స్ 23 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మాక్స్ ఓదౌద్ ఒక్కడే 53బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 71 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆ తర్వాత కెప్టెన్ స్కోట్ ఎడ్వర్డ్ ఒక్కడే 21 స్కోరుతో ఫర్వాలేదనిపించాడు. 20 ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేయగలిగింది.
లంక బౌలర్లలో హసరంగ మూడు; మహీష్ తీక్షణ రెండు; లాహిరు కుమారా, ఫెర్నాండో చెరో వికెట్ పడగొట్టారు.
కుశాల్ మెండీస్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Also Read : ICC Men’s T20 World Cup 2022: జింబాబ్వేపై విండీస్ గెలుపు