మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ సాధికార కమిటీ సమావేశం జరిగింది. దీనికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బిసి సెల్ అధ్యక్షుడు కొల్లు రవీంద్ర, 54 సాధికార కమిటీ కన్వీనర్లు పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని, నిధులు లేని కార్పోరేషన్ లను బీసీలకు కేటాయించి, నిధులు ఉన్న వాటిని తమ సామాజిక వర్గానికి కేటాయించారని అచ్చెన్నాయుడు విమర్శించారు. దీనిపై ఆయన సామాజిక మాధ్యమాల్లో ఓ ప్రకటన ఇచ్చారు.
‘జగన్ పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, ఉద్యమ కార్యాచరణపై చర్చించాం. సాధికార కమిటీల ఏర్పాటు, బలోపేతం పై సమాలోచనలు చేశాం. బీసీల్లో ఉన్న అన్ని కులాలకు ప్రాతినిధ్యం, కులాల వారీగా సమస్యల అధ్యయనం పై ప్రణాళిక సిద్ధం చేశాం. బీసీల సొంత ఇల్లు తెలుగుదేశం పార్టీ. 34% రిజర్వేషన్లు 26 ఏళ్ల పాటు అమల్లో ఉండానికి కారణం టిడిపి. బీసీ రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గడానికి కారణం జగన్ రెడ్డి. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్ అంటూ బిల్డప్ ఇచ్చిన జగన్ రెడ్డి బీసీల బ్యాక్ బోన్ విరిచేసాడు. నిధులు ఉన్న వెయ్యి ముఖ్య పదవులు తన బంధువులకు, తన సామాజిక వర్గానికి ఇచ్చుకొని నిధులు లేని 56 కార్పొరేషన్లు బీసీలకు ఇచ్చాడు జగన్ రెడ్డి” అంటూ పేర్కొన్నారు.