మధ్యప్రదేశ్ లోని రేవా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 15 మంది దుర్మరణం చెందారు. ప్రమాదంలో 40 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకుంది. వీరంతా కూలీలుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
గాయపడిన వారిలో 20 మందిని ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని ఆసుపత్రిలో చేర్చినట్లు రేవా ఎస్పీ నవనీత్ భాసిన్ తెలిపారు. దాదాపు 100 మందితో బస్సు హైదరాబాద్ నుంచి గోరఖ్‌పూర్ వెళ్తోంది. బస్సులో ఉన్న వారంతా ఉత్తరప్రదేశ్ వాసులుగా చెబుతున్నారు. దీపావళి పండుగ కోసం తమ స్వస్థలాలకు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఎంపీ-యూపీ సరిహద్దుకు సమీపంలోని సోహగి కొండ సమీపంలోకి బస్సు చేరుకోగానే అదుపుతప్పి ట్రక్కును ఢీకొని ప్రమాదానికి గురైంది. స్థానికులు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి పంపించారు. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.