Sunday, November 24, 2024
HomeTrending Newsఅది ముమ్మాటికీ రాజకీయ యాత్ర: అంబటి

అది ముమ్మాటికీ రాజకీయ యాత్ర: అంబటి

అమరావతి రైతుల పాదయాత్రకు ఇది తాత్కాలిక విరామం కాదని, శాశ్వత విరామం అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అమరావతి నుంచి అరసవిల్లి వెళ్ళాల్సిన ఈ యాత్ర నేరుగా సాగకుండా అనేక నియోజకవర్గాలు తిరుగుకుంటూ వెళ్ళడం మొదలైందన్నారు. మధ్యలో తొడలు కొట్టడం, జగన్ ను విమర్శించడం, చంద్రబాబును మెచ్చుకోవడం, టిడిపి జెండాలు కప్పుకోవడంతో ఇదో రాజకీయ పాదయాత్రగా తయారయ్యిందన్నారు.

ధవళేశ్వరం బ్యారేజీకి ప్రపంచ వారసత్వ నీటిపారుదల కట్టడంగా అంతర్జాతీయ గుర్తింపు రావడం, ఆస్ట్రేలియా అడిలైడ్ లో నిర్వహించిన ఐసీఐడీ 24వ సదస్సులో గుర్తింపు పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం బ్యారేజి వద్దగల కాటన్ గెస్ట్ హౌస్ వద్ద పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన అంబటి మీడియాతో మాట్లాడారు.

ఈ యాత్ర అసలు సూర్య దేవాలయానికి చేరాడని, మధ్యలోనే భస్మమైపోతుందని అంబటి పునరుద్ఘాటించారు. తాము కేవలం 600 మందికే అనుమతి ఇస్తే ఇన్ని వేల మంది ఎందుకు వస్తున్నారంటూ హైకోర్టు కూడా ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. కోర్టు చెప్పినట్లు కాకుండా తమ ఇష్టం వచ్చినట్లు యాత్ర చేస్తామని వారు అనుకుంటున్నారని విమర్శించారు. కోర్టు డైరెక్షన్ ప్రకారం ఐడి కార్డులు చూపించాలని పోలీసులు అడిగితే యాత్రకు విరామం ఇచ్చి మళ్ళీ కోర్టులు వెళతామని అంటున్నారని ఎద్దేవా చేశారు.

ఈ పాదయాత్రతో ఒక మంచి జరిగిందని, ఉత్తరాంధ్ర ప్రజలు చైతన్యం పొందారని, తమ ప్రాంతానికి పాలనా రాజధాని వస్తుంటే టిడిపితో కలిసి కొందరు ధనవంతులు అడ్డుకుంటున్న విషయాన్ని గుర్తించి వారు ఏకమయ్యారని రాంబాబు అభిప్రాయపడ్డారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్