తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను వేధించడానికే సిఐడి విభాగం పరిమితమైందని మాజీమంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. తాము సాక్ష్యాధారాలతో 300కు పైగా ఫిర్యాదులు చేసినా ఫలితంలేదని, ఇంతవరకూ ఒక్క కేసుకు దిక్కూ దివాణంలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని ఆరోపించారు.
వైసీపీ నుండి ఒక్క ఫిర్యాదు వచ్చినా ఆఘమేఘలపై చర్యలు తీసుకుంటోందని, అసలు ఎవరూ ఫిర్యాదు ఇవ్వకపోయినా సరే కేసులు పెట్టి వేధిస్తున్నారని, తమ పార్టీ నాయకులపై కస్టోడియల్ టార్చర్ అధికమైందని ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐడి వైసీపీకి అనుబంధ విభాగంగా పని చేస్తోందని, అధికార పార్టీ చేతిలో పావుగా మారిందన్నారు. అర్ధరాత్రి పూట హడావుడిగా వచ్చి అరెస్టులు చేస్తున్నారని, సుప్రీం కోర్టు నిబంధనలను సైతం సిఐడి అధికారులు బేఖాతర్ చేస్తున్నారని ఆనందబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీతో సిఐడి వ్యక్తిగత కక్ష్యతో వ్యవహరిస్తున్నట్లు కనబడుతోందన్నారు. వైసీపీ రాక్షస క్రీడలకు అంతకంత మూల్యం చెల్లించుకోవాల్సివుంటుందని ఆయన హెచ్చరించారు.
చట్టం అందరికీ సమానమనే విషయాన్ని పోలీసులు మరిచారని, రాష్ట్రంలో ఐపీసీ పనిచేయడంలేదని, అంబేద్కర్ రాజ్యంగాన్ని నిట్టనిలువున పాతర వేస్తున్నారని దుయ్యబట్టారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలన్నారు. సిఐడి చీఫ్ ఇప్పటికైనా తన ధోరణి మార్చుకోవాలన్నారు.
వృద్దుల నుంచి 4 సంవత్సరాల పసిపాప వరకు ఇంటరాగేషన్ పేరుతో వేధించడం హేయమైన చర్యఅని మండిపడ్డారు. శిరోముండనాలు, లాకప్ డెత్ లు వైసీపీ హయాంలోనే జరిగాయన్నారు. టీడీపీ నాయకులపై వ్యక్తిగత కక్ష తీర్చుకోవడం మానుకోవాలని సిఐడికి ఆనంద్ బాబు సూచించారు.
Also Read : అమరావతి భూముల కేసులో ఐదుగురు అరెస్ట్