టి 20వరల్డ్ కప్ లో నేడు సంచలన విజయం నమోదైంది. ఇంగ్లాండ్ పై ఐర్లాండ్ ఐదు వికెట్ల తేడాతో సంచలన విజయం నమోదు చేసింది. వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలగడంతో డక్ వర్త్ లూయీస్ (డిఎల్ఎస్) పధ్ధతి ద్వారా ఐర్లాండ్ విజయం సాధించినట్లు మ్యాచ్ అధికారులు ప్రకటించారు.
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఐర్లాండ్ కెప్టెన్ బాల్బిరిన్ 47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 62; టక్కర్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ తో 34; కర్టిస్ కాంపర్-18 పరుగులు చేయడంతో 19.2 ఓవర్లలో 157పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్, లియామ్ లివింగ్ స్టోన్ చెరో మూడు; శామ్ కర్రన్ రెండు; బెన్ స్టోక్స్ ఒక వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన ఇంగ్లాండ్ 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ జోస్ బట్లర్ డకౌట్ కాగా, మరో ఓపెనర్ ఆలెక్స్ హేల్స్-7; బెన్ స్టోక్స్-6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టారు. డేవిడ్ మలాన్-35; హ్యారీ బ్రూక్ -18 పరుగులు చేసి ఔటయ్యారు. మొయిన్ అలీ-24; లివింగ్ స్టోన్-1 పరుగులతో క్రీజులో ఉన్న సమయంలో వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. దీనితో డిఎల్ఎస్ విధానం ప్రకారం ఐర్లాండ్ ను విజేతగా ప్రకటించారు.
ఐర్లాండ్ కెప్టెన్ బల్బిరీన్ ను ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ వరించింది.
Also Read : ICC Men’s T20 World Cup 2022: స్టోనిస్ విధ్వంసం: ఆసీస్ గెలుపు