Saturday, November 23, 2024
HomeTrending Newsధరణి రద్దు చేస్తాం - రాహుల్ గాంధి

ధరణి రద్దు చేస్తాం – రాహుల్ గాంధి

తెలంగాణలో రాహుల్ భారత్ జోడో యాత్ర మూడో రోజు మొదలైంది. నారాయణపేట్‌ జిల్లా ఎలిగండ్లనుంచి యాత్ర ప్రారంభమైంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి జోడో యాత్ర జెండా ఆవిష్కరించారు. రాహుల్‌తో కలిసి నడిచేందుకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి రావడంతో ఎలిగండ్ల సందడిగా మారింది. ఎలిగండ్లనుంచి ప్రారంభమైన ఈ యాత్ర మరికల్ , పెద్ద చింతకుంట, లాల్ కోట చౌరస్తా, దేవరకద్ర మీదుగా సాగుతుంది. మార్గ మధ్యలో గోపాల్‌ పూర్‌లో మధ్యాహ్న భోజన విరామం ఉంటుంది. మన్యంకొండ వద్ద సభ నిర్వహిస్తారు. ఇవాళ 23 కిలోమీటర్ల 300 మీటర్ల మేర యాత్ర సాగుతుంది. ధర్మాపూర్‌లో రాత్రి బస చేసే విధంగా సన్నాహాలు పూర్తి చేశారు.

రాహుల్ గాంధీ గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని ఆయన అన్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని కౌలు రైతులను ఆదుకుంటామని కూడా ఆయన అన్నారు. యాత్రలో భాగంగా రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… రాష్ట్రంలో సాగుతున్న పాలన గురించి వివరించారు. ధరణి పోర్టల్ వల్ల వాస్తవ భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అదే సమయంలో కబ్జాకోరులకు ఆయాచిత లబ్ధి జరుగుతోందని రేవంత్ చెప్పారు.

ఈ వివరాలన్నీ విన్న రాహుల్ గాంధీ… గురువారం మధ్యాహ్నం తెలంగాణకు చెందిన పలువురు రైతులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు. భూ యజమానులకే భద్రత లేకపోతే ఇంకెవరికి భద్రత ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో సాగు కలిసి రాక పెద్ద సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారిలో మెజారిటీ రైతులు కౌలు రైతులేనని రాహుల్ అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక కౌలు రైతులకు భరోసా కల్పిస్తామని ఆయన అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి బీజేపీ టీఆర్ఎస్ సమ దూరంలో ఉన్నాయని, అవి రెండూ కాంగ్రెస్ కు శత్రువులని రాహుల్ స్పష్టం చేశారు. నాణేనికి బొమ్మ బొరుసు మాదిరే టీఆరెస్, బీజేపీ అని రెండు పార్టీలు ఒకదానికోకటి సహకరించుకుంటు డ్రామాలు చేస్తున్నాయని విమర్శించారు. అడ్డగోలుగా ఎమ్మెల్యేలు కొనుగోలు తో నవ్వులపాలు చేస్తున్నారని, దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం కేసీఆర్ దే అన్నారు. దొంగతనం చేసే అవకాశం ఉన్న చోటల్లా దోచుకుంటున్న కేసీఆర్ అండ్ కో..15 వేల కోట్ల మియపూర్ భూముల కుంభకోణంలో ఎలాంటి విచారణ చేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో విచ్చలవిడి అవినీతి జరగిందని, టీఆరెస్ బీజేపీ రాజకీయ పార్టీలు కాకుండా వ్యాపార సంస్థలుగా ఉన్నాయన్నారు.

Also Read : తెలంగాణకు భారత్ జోడో యాత్ర

RELATED ARTICLES

Most Popular

న్యూస్