Saturday, November 23, 2024
HomeTrending Newsతెలంగాణకు హరితహారం అందరికీ ఆదర్శం

తెలంగాణకు హరితహారం అందరికీ ఆదర్శం

తెలంగాణకు హరితహారం అమలు, రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెంపు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని గ్రీన్ తమిళనాడు మిషన్ డైరెక్టర్, సీనియర్ ఐ.ఎఫ్.ఎస్ అధికారి దీపక్ శ్రీవాత్సవ అన్నారు. రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా ఆయన హరితహారం అమలును అధ్యయనం చేశారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవటంలో భాగంగా గ్రీన్ తమిళనాడు పేరుతో తమ ప్రభుత్వం రానున్న పదేళ్లలో 265 కోట్ల మొక్కలను నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. తెలంగాణ అటవీశాఖ ఆధ్వర్యంలో గత ఎనిమిదేళ్లుగా అమలవుతున్నహరితహారం ఫలితాలను ఆయన క్షేత్ర స్థాయిలో వివిధ ప్రాంతాల్లో పరిశీలించారు. ఔటర్ రింగ్ రోడ్డు, కరీంనగర్- రామగుండం జాతీయ రహదారితో పాటు, సిద్దిపేట జిల్లాలో అటవీ పునరుద్దరణ పనులు- ఫలితాలను స్వయంగా చూసిన దీపక్ శ్రీవాత్సవ ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

ఒక ప్రాధాన్యతా పథకంగా పచ్చదనం పెంపును తెలంగాణ ప్రభుత్వం అమలు చేయటం ముఖ్యమంత్రి కేసీయార్ ముందుచూపుకు, దూరదృష్టికి నిదర్శనం అన్నారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలన్నీ చెట్లుగా మారిన తర్వాత కర్బన ఉద్ఘారాల ప్రభావాన్ని తగ్గించటంలో గణనీయంగా పనిచేస్తాయని అన్నారు.

క్షేత్ర స్థాయి పర్యటన తర్వాత దీపక్ శ్రీవాత్సవ అరణ్య భవన్ లో పీసీసీఎఫ్ & హెచ్ఓఓఎఫ్ ఆర్.ఎం. డోబ్రియాల్ తో సమావేశం అయ్యారు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల అటవీ శాఖలు అమలు చేస్తున్న కార్యక్రమాలు, మెట్టుపలాయం అటవీ కళాశాల పరిధిలో చేపట్టిన అగ్రో ఫారెస్ట్రీ అభివృద్ది కార్యక్రమాలపై చర్చ జరిగింది. యూనివర్సిటీగా రూపాంతరం చెందుతున్న తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (FCRI), ములుగులో చేపట్టాల్సిన కొత్త కార్యక్రమాలను అధికారులు చర్చించారు. ఆగ్రో ఫారెస్ట్రీ కింద రైతులను ప్రోత్సహించి పల్ప్ వుడ్, ఫ్లై వుడ్ తయారీకి అవసరమైన చెట్లు పెంచటం ద్వారా అదనపు ఆదాయం పొందేలా చూడవచ్చని తెలిపారు. కార్పోరేట్ సంస్థలు, స్వచ్చంద సంస్థల సహకారంతో ఫారెస్ట్ బిజినెస్ ఇంకుబేషన్ సెంటర్ ఏర్పాటును పరిశీలిస్తున్నామని తమిళనాడు అధికారి దీపక్ శ్రీవాత్సవ తెలిపారు.

ఈ సమావేశంలో చీఫ్ కన్జర్వేటర్లు రామలింగం, సైదులు, డిప్యూటీ కన్జర్వేటర్ శాంతారామ్, సిద్దిపేట జిల్లా అటవీ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.

Also Read : హరితహారంలో 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం

RELATED ARTICLES

Most Popular

న్యూస్