తల్లిదండ్రులు అప్పు కట్టలేదని వారి అమ్మాయిలను వేలం వేసిన అమానుష ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకొన్నది. భీల్వాడా జిల్లాలో ఈ దారుణం జరిగింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఓ వ్యక్తి రూ.15 లక్షల అప్పు తీర్చలేకపోయాడు. దీంతో అతడిపై పంచాయితీ పెట్టి అతని చెల్లిని వేలం వేశారు. అయినా అప్పు ముట్టకపోవటంతో అతడి 12 ఏండ్ల కూతురికి అర్రస్ పా డారు. అప్పటికీ అప్పు తీరకపోవటంతో తన ఐదుగురు చెల్లెళ్లను విక్రయించాల్సి వచ్చింది.
ఇదొక్కటే కాదు ఇలాంటి ఘటనలు రాజస్థాన్‌లోని ఆరు జిల్లాల్లో జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో బాధితుడి భార్యపై లైంగికదాడులు కూడా చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో రెండు కుటుంబాలు, వర్గాల మధ్య గొడవలు తలెత్తితే స్థానిక పంచాయితీ పెద్దలను ఆశ్రయిస్తున్నారు. అందులో ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు ఉన్నవే. కుటుంబ పెద్ద అప్పు తీర్చకపోతే, ఆ కుటుంబ ఆస్తులను పంచాయితీ పెద్దలు వేలం వేస్తున్నారు. 8-18 ఏండ్ల బాలికలు ఉంటే వారిని వేలంలో అమ్మేస్తున్నారు. ఇందుకు ఒప్పుకోకపోయినా, వేలంలో అమ్మాయిలకు అప్పు తీర్చాల్సినంత డబ్బు రాకపోయినా వారి భార్యపై లైంగికదాడి చేస్తున్నారు. దీనికి సంబంధించి స్టాంప్ పేపర్లపై ఒప్పందాలు కూడా జరుగుతుండటం గమనార్హం. వేలంలో కొన్న అమ్మాయిలను ఇతర రాష్ర్టాలకు తరలించి వేశ్యలుగా మార్చుతున్నారు.
ఈ ఘటనలను మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రస్తావించటంతో జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ ఘటనల్లో నిజం ఎంతనేది నిగ్గు తేల్చేందుకు ఇద్దరు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఘటనలపై ఉన్నపలంగా చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ చీఫ్ సెక్రటరీకి… ఎన్సీడబ్ల్యూ చైర్‌పర్సన్ రేఖ శర్మ లేఖ రాశారు. వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, నిందితులను అరెస్టు చేయాలని ఆ రాష్ట్ర డీజీపీని కోరారు.