బీజేపీ, టీఆరెస్ సమన్వయంతో కాంగ్రెస్ ను లేకుండా చేయాలనుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. వ్యూహాత్మకంగా రెండు పార్టీలు వివాదం సృష్టిస్తున్నాయన్నారు. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ రోజు మునుగోడులో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు టి జీవన్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాజకీయం చేసి…తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని రేవంత్ విమర్శించారు. గతంలో దుబ్బాక ఉప ఎన్నికలో కూడా ఇలాంటి ప్రయత్నమే చేశారన్నారు.
కేసీఆర్ ను ఓడించాలనే లక్ష్యంతో దుబ్బాకలో బీజేపికి ఓటు వేశారని, ఇప్పుడు ఆ ఎన్నికల్లో దొరికిన డబ్బులు ఏమయ్యాయో తెలియదని రేవంత్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటెలకు అన్యాయం జరుగుతుందని సానుభూతి పొందారని…దీంతో కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ కాంగ్రెస్ సానుభూతిపరులు ఈటెల కు ఓటు వేశారని చెప్పారు. ఈటెల ఆక్రమించుకున్న భూములు ఏమయ్యాయని రేవంత్ ప్రశ్నించారు. ఆయనపై కేసులు ఏమయ్యాయన్నారు. ఆయన్ను జైలుకు పంపిస్తామన్న వారు ఏమయ్యారు? కాంగ్రెస్ ను పోటీ నుంచి తప్పించే విధంగా ఈ రెండు పార్టీలు వ్యవహారిస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి కుట్రలను తిప్పి కొట్టాలని ముందే శ్రేణులకు పిలుపునిచ్చానని, మూడు రోజుల క్రితం ఫామ్ హౌస్ లో నాటకం పరాకాష్టకు చేరిందన్నారు. మునుగోడు ఉపఎన్నిక, జోడో యాత్ర దృష్టిని మరల్చేందుకే ఈ నాటకాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్, కేటీఆర్ కు ఫామ్ హౌస్ లు బాగా అచొచ్చాయని, అందుకే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని చర్చకు తెచ్చారన్నారు. ఇప్పటివరకు విడుదలైన ఆడియో రికార్డుల ప్రకారం..పైలట్ రోహిత్ రెడ్డి వాళ్ళను డబ్బులు అడుగుతున్నాడని, ఇతరులను తీసుకొస్తానని బేరం చేస్తున్నాడని రేవంత్ అన్నారు. రోహిత్ రెడ్డిని నిందితుడిగా చేర్చకుండా పీసీ యాక్ట్ ఎలా నిలబడుతుందన్నారు. ఈ మాత్రం కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకి తెలియదా? ఈ వ్యవహారంలో అత్యంత కీలకమైన నలుగురు ఎమ్మెల్యేల ఫోన్స్ ఎందుకు సీజ్ చేయలేదని ప్రశ్నించారు.
ఏసీబీ పూర్తిగా కేసీఆర్ డైరెక్షన్ లో నడుస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. కేసును నిరూపించాలన్నా ఫోన్స్, అక్కడి సీసీ కెమెరాలే కీలకమని, పోలీసులే ఎమ్మెల్యేలను ప్రగతి భవన్ తీసుకెళ్లారని.. అప్పటి నుంచి ఆ ఎమ్మెల్యేలు కనిపించడం లేదని రేవంత్ అన్నారు. వారు ఎక్కడున్నారు? వారిని ఏం చేశారు? ఎమ్మెల్యేల ముఠాకు నాయకుడైన కేసీఆర్ పర్యవేక్షణలొనే జరిగిందని ఆరోపణలు వస్తున్నాయన్నారు. అలా అయితే కేసీఆర్ ను ఏ1గా, కేటీఆర్ ను ఏ2గా చేర్చాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలను నిందితులుగా చేర్చాలి. వారికి సంబంధం లేకుంటే..ఢీల్లీ పెద్దలు ఎవరో తేల్చి వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో సంతోష్ జీ పేరు కూడా చర్చకు వస్తోందని, అసలు ఏం జరిగిందనేది చెప్పాల్సిన బాధ్యత విచారణ సంస్థలపై ఉందన్నారు.
ఎమ్మెల్యేలను తీసుకెళ్లిన పోలీసుల చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఫోన్స్ సీజ్ చేస్తే ఆ ఆడియో రికార్డులు ఎలా బయటకు వచ్చాయి…అదంతా ఎడిటెడ్ వెర్షన్.. అసలు ఆడియోలను విచారణ సంస్థలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. భారత్ జోడో యాత్ర దృష్టి మరల్చేందుకే ఈ డ్రామా..కాంగ్రెస్ చర్చలోకి రాకుండా చేయాలనే ఈ డ్రామాలు అని విమర్శించారు. బాధ్యత గల సీఎం, మంత్రులు, అధికారులు ఈ అంశాలపై స్పందించాలని, విచారణ సంస్థలపై నమ్మకం లేదన్నారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ కేసును విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
2014 నుంచి ఇప్పటి వరకు 32 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ పై సీఎం కేసీఆర్ ప్రజలకు ఏం జరిగిందో వివరించాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ వి జోకర్ వేషాలని, ఆయన నీళ్లు కాదు యాసిడ్ పోసుకుని ప్రమాణం చేసినా ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ గుండుతో గుట్ట ఎక్కిన ప్రజలు నమ్మరని, అంత బుద్ది మంతుడైతే స్రవంతి సవాల్ ను ఎందుకు స్వీకరించలేదన్నారు. ఇప్పటికైనా యాదగిరిగుట్ట నర్సింహ స్వామి మీద ఒట్టేస్తారా…తాను వస్తానని..బండి సంజయ్, కేటీఆర్ వచ్చి ఒట్టేస్తారా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. లేదా అభ్యర్థులు వెళ్లి ప్రమాణం చేసిన సరే అన్నారు.
Also Read : రాచకొండ భూములపై కెసిఆర్ కన్ను రేవంత్ రెడ్డి