టి 20 వరల్డ్ కప్ లో వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి మంచి ఫామ్ లో ఉన్న టీమిండియాకు సౌతాఫ్రికా షాకిచ్చింది. నేడు జరిగిన మ్యాచ్ లో ప్రోటీస్ జట్టు ఇండియాపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. పెర్త్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా జట్టులో ఓపెనర్లు కేఎల్ రాహుల్(9), కెప్టెన్ రోహిత్ శర్మ(15) మరోసారి విఫలమయ్యారు, కోహ్లీ(12) కూడా నిరాశపరిచాడు. దీపక్ హుడా డకౌట్ కాగా, హిట్టర్ హార్దిక్ పాండ్యా కేవలం రెండు పరుగులకే వెనుదిరిగాడు, 49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ ఐదులో నిగిడి నాలుగు వికెట్లు సొంతం చేసుకోవడం విశేషం. ఈ దశలో సూర్య కుమార్ యాదవ్- దినేష్ కార్తీక్ లు ఆరో వికెట్ కు 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సూర్య 40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 68 పరుగులు చేసి ఔటయ్యాడు. మిగిలిన బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది.
సౌతాఫ్రికా బౌలర్లలో నిగిడి నాలుగు; పార్నేల్ మూడు; నార్త్జ్ ఒక వికెట్ పడగొట్టారు.
లక్ష్యం స్వల్పమే అయినా సౌతాఫ్రికా కూడా 24 పరుగులకే మూడు వికెట్లు (డికాక్-1; రోస్సో డకౌట్; కెప్టెన్ బావుమా-10) కోల్పోయింది. ఈ స్థితిలో డేవిడ్ మిల్లర్- ఏడెన్ మార్ క్రమ్ లు నెమ్మదిగా ఆడి ఇన్నింగ్స్ చక్కదిద్దడంపై దృష్టి సారించి కుదురుకున్న తరువాత పరుగుల వేగం పెంచారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్ కు 76 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. మార్ క్రమ్ 41 బంతుల్లో 6 ఫోర్లు 1సిక్సర్ తో 52 పరుగులు చేసి ఔట్ కాగా, డేవిడ్ మిల్లర్ 46 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇండియా బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ రెండు; మహ్మద్ షమి, హార్దిక్ పాండ్యా, అశ్విన్ తలా ఒక వికెట్ సాధించారు.
నాలుగు వికెట్లతో రాణించిన సౌతాఫ్రికా బౌలర్ నిగిడికే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Also Read : ICC Men’s T20 World Cup 2022: పాకిస్తాన్ కు తొలి విజయం