Thursday, June 11, 2026
Homeవార ఫలాలువార ఫలాలు

వార ఫలాలు

07-06-2026 నుంచి 13-06-2026 వరకు

Weekly Horoscope in Telugu:

మేషం (Aries):
చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కొత్త విషయాలను నేర్చుకుంటారు. నూతన మిత్రులు తోడ్పడతారు. ఇష్టమైన వారితో విందులకు వెళతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా సాగుతాయి. అప్పులు తీర్చగలుగుతారు. సంతాన సంబంధ విషయాలు సంతృప్తినిస్తాయి. ఇంటికి అవసరమైన సౌకర్యాలను సమకూర్చుతారు. కొన్ని సందర్భాల్లో అదృష్టం తోడవడంతో కార్యాలు సానుకూలంగా ముగుస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. దూర ప్రయాణాలు, బంధువులకు అనారోగ్య సూచనలు ఉన్నాయి.

వృషభం (Taurus):
యోగదాయకంగా ఉంటుంది. ప్రయత్నించిన ప్రతి కార్యమూ సఫలం అవుతుంది. శత్రువుల ఎత్తులను చిత్తు చేస్తారు. పోటీల్లో విజేతలుగా నిలుస్తారు. పెద్దలు, అధికార వర్గాల మన్ననలు, సహకారాన్ని పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిర్ణయాల్లో స్థిరత్వం, అవకాశాలను సద్వినియోగం చేసుకునే నేర్పు వృద్ధి చెందుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సౌఖ్యాన్ని ఆస్వాదిస్తారు. సంతానం వృద్ధిలోకి వస్తుంది. వారం చివరలో కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. వృథా ఖర్చులకు అవకాశం ఉంది.

మిథునం (Gemini):
పట్టింది బంగారంలా సాగుతుంది. చిన్నపాటి ఆటంకాలు వచ్చినా సమయస్ఫూర్తితో దాటేస్తారు. వ్యవహారాలన్నీ విజయవంతం అవుతాయి. ధన సంబంధ లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రతిభను చూపి ఉన్నతాధికారుల నుంచి చక్కటి ప్రశంసలు, రివార్డులను పొందుతారు. కొత్త బాధ్యతలను చేపట్టాల్సి వస్తుంది. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కర్కాటకం (Cancer):
ఈవారం కష్టే ఫలి అనే సూత్రాన్ని విశ్వసించండి. చిత్తశుద్ధితో చేపట్టే వ్యవహారాలు విజయవంతం అవుతాయి. బద్ధకం వల్ల చిక్కుల్లో పడే వీలుంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రయాణం గోచరిస్తోంది. అనుకున్న సమయానికి లక్ష్యం చేరుకోలేక ఇబ్బంది పడతారు. భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు పెరుగుతాయి. అనవసర తగాదాలకు ఆస్కారముంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. ముఖ్యంగా ఉద్యోగులు అప్పగించిన బాధ్యతలను శ్రద్ధతో నిర్వహించాలి. సంతానం తీరు ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

సింహం (Leo):
ముఖ్యమైన అన్ని కార్యాల్లో విజయం సాధిస్తారు. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. కొత్త విజ్ఞానాన్ని పెంచుకుంటారు. ఇది భవిష్యత్తులో కీలక సమయంలో ఉపకరిస్తుంది. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుతారు. ఇంటికి అవసరమైన వస్తువులను కొంటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులు అప్రమత్తంగా లేకుంటే పైఅధికారుల కోపానికి గురవుతారు. ఇష్టంలేని బదిలీలు ఎదురయ్యే వీలుంది. పుణ్య కార్యాల్లో పాల్గొంటారు.

కన్య (Virgo):
తలపెట్టిన ప్రతి కార్యమూ సఫలం అవుతుంది. బంధు మిత్రుల సహకారంతో అభీష్టాన్ని నెరవేర్చుకుంటారు. ధన సంబంధ చిక్కులు క్రమంగా తొలగిపోతాయి. ఆదాయం పెరిగే మార్గాలు కనిపిస్తాయి. సమాజంలో కీర్తి పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. కొత్త వారితో సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. సంతాన సంబంధ సౌఖ్యాన్ని పొందుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇష్టంలేని పనిని చేయాల్సి వస్తుంది. చెప్పుడు మాటలు నమ్మకండి.

తుల (Libra):
వారం మొదట్లో కొంత అసౌకర్యంగా ఉంటుంది. రానురాను పనుల్లో వేగం పెరుగుతుంది. ప్రతి సందర్భంలోనూ అనుకూల ఫలితాలే అందుతాయి. నిరాశ దూరమవుతుంది. ధన సంబంధ విషయాలు లాభసాటిగా ఉంటాయి. నూతన వస్తుప్రాప్తి ఉంది. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక, వినోద క్షేత్రాలకు వెళతారు. సంతానం గురించిన శుభ వార్తను వింటారు. వారం చివరికల్లా చికాకులన్నీ తొలగిపోతాయి. పాత, కొత్త వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. కొత్త విషయాలు తెలుస్తాయి.

వృశ్చికం (Scorpio):
ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగేయాలి. మీ పురోగతికి అడ్డు తగిలేవారు పెరుగుతారు. బుద్ధి నిలకడ లోపిస్తుంది. ఆత్మీయులతోనే విరోధం గోచరిస్తోంది. బద్ధకం వదిలి బాగా శ్రమిస్తే ప్రయోజనం ఉంటుంది. నీచమైన ఆలోచనలను దూరం చేయండి. చెప్పుడు మాటలను విశ్వసించకండి. ఇతరుల విషయాల్లో అనవసర జోక్యాల వల్ల విభేదాలు, విరోధాలు పెరుగుతాయి. వారం చివరికి పరిస్థితిలో కాస్త మెరుగుదల ఉంటుంది. మిత్రులు తోడుగా నిలుస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు మంచిది కాదు.

ధనస్సు (Sagitarus):
ముఖ్యమైన వ్యవహారాలను చేపట్టడంలో జాప్యం చేయకండి. వాయిదాల వల్ల ఆశించిన ఫలితాలు రావు. పైగా మీ ప్రయత్నాలకు అవరోధాలూ పెరుగుతాయి. వారం ప్రారంభంలో మీలో ఆత్మవిశ్వాసం బలంగా ఉంటుంది. కార్యసాధనలోనూ దూసుకు వెళతారు. విశేషలాభాన్ని పొందుతారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్నిస్తుంది. వారం ద్వితీయార్థంలో అయినవారితోనే గొడవలు వస్తాయి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. వృథా ఖర్చులు పెరగడం ఆందోళనకు కారణమవుతుంది. కీలక సమయంలో మీ తెలివితేటలు అక్కరకు రావు.

మకరం (Capricorn):
చేపట్టిన పనులు కాస్త నెమ్మదిగానే అయినా ఫలిస్తాయి. మీరు తీసుకునే సాహసోపేత నిర్ణయం మంచి ఫలితాన్నిస్తుంది. అన్నివైపుల నుంచి సహకారం అందుతుంది. బంధువులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. సోదర వర్గం తోడుగా నిలుస్తుంది. వారం మధ్యలో శుభవర్తమానం అందుతుంది. ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా బ్యాంకు విషయాల్లో జాగ్రత్త అవసరం. మాట తప్పడం వల్ల చిక్కుల్లో పడతారు. నిందలు ఎదురయ్యే సూచనలున్నాయి. స్థిరాస్తి లావాదేవీలను వాయిదా వేయండి.

కుంభం (Aquarius):
అభీష్టం నెరవేరుతుంది. చేపట్టిన కార్యాలు శుభప్రదంగా సాగుతాయి. అన్ని సందర్భాల్లో మీ శ్రమకు అదృష్టం కూడా తోడవుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆత్మీయులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు యోగదాయకంగా ఉంది. ఆరోగ్యం మెరుగ్గా వుంటుంది. దాయాదులతో సఖ్యత పెరుగుతుంది. ముఖ్యమైన వర్తమానం ఆనందాన్ని పెంచుతుంది. కీలక వ్యవహారంలో విశేష లాభాన్ని పొందుతారు. అనవసరమైన హామీలను ఇవ్వకండి. వివాదాలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించుకోండి.

మీనం (Pisces):
తొందరపాటు నిర్ణయాలు సరికాదు. కీలక వ్యవహారాల్లో ఆత్మీయులు, మిత్రులను సంప్రదించండి. దూర ప్రయాణం గోచరిస్తోంది. న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే వీలుంది. నోటి దురుసు కారణంగా దగ్గరి వాళ్లతోనే విరోధం ఏర్పడుతుంది. మిత్రుల ఆంతరంగిక, కుటుంబ వ్యవహారాల్లో సంయమనం పాటించండి. వేళకు భోజనం ఉండదు. బాధ్యతలను వదులుకోవాల్సి రావచ్చు. వారం మధ్యలో ముఖ్యమైన వ్యవహారంలో అదృష్టం తోడుంటుంది. కుటుంబంలో చికాకులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చులు తగ్గించండి.

గమనిక :
జన్మరాశిని అనుసరించి ఈ ఫలితాలు చూసుకోవాలి. ఇవి, గోచార గ్రహాల సంచారాన్ని బట్టి నిర్ణయించిన స్థూల ఫలితాలు. వ్యక్తిగత జాతక ఫలితాలు తెలుసుకో దలచిన వారు, తమ జన్మ వివరాలు (పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు) దిగువ సూచించిన మెయిల్ ఐడీకి పంపగలరు.

శుభం భూయాత్

పి.విజయకుమార్
[email protected]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular