-0.4 C
New York
Thursday, December 7, 2023

Buy now

HomeTrending Newsముకుల్ రాయ్ పై 'మమతా'నురాగం

ముకుల్ రాయ్ పై ‘మమతా’నురాగం

పశ్చిమబెంగాల్ రాజకీయాలు మరోమారు ఆసక్తికరంగా మారుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ షాక్ ఇద్దామని భావించి అసెంబ్లీ ఎన్నికల్లో బోర్లా పడిన బీజేపీకి రివర్స్ లో షాక్  ఇచ్చే పనిలో పడ్డారు బెంగాల్ దీదీ. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో అధికారాన్ని తిరిగి సాధించిన మమత, కేంద్ర లో అధికారంలో వున్న బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమై, ఢీ అంటే ఢీ అంటున్నారు. అంతేకాదు పశ్చిమ బెంగాల్ లో బలం పెంచుకున్నామన్న ధీమాతో వున్న కమలనాథులను ఊహించని రీతిలో  దెబ్బకొట్టేందుకు పక్కా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఎన్నికల ముందు టీఎంసీని వీడి బీజేపీలో చేరిన వారికి తిరిగి గాలం వేస్తున్నారు.

ఇందులో భాగంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ గతంలో టీఎంసీ కీలక నేత ,ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు అయిన ముకుల్ రాయ్ ను తిరిగి సొంత గూటికి రప్పించి బీజేపీ అధిష్టానానీకి దిమ్మ తిరిగేలా చేశారు.

తనయుడు సుభ్రాంశు రాయ్ తో కలిసి ముకుల్ రాయ్ టీఎంసీలో చేరారు. ముఖ్యమంత్రి,పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సమక్షంలో పార్టీలోకి పునరాగమనం చేశారు.అంతే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ దీదీ కూడా మమతానురాగాలు కురిపించారు.ఆయన పార్టీలో కీలకపాత్ర పోషిస్తారని కూడా ప్రకటించారు.అయితే డబ్బుల కక్కూర్తితో బీజేపీ లో చేరి తమ పార్టీకి ద్రోహం తలపెట్టి, తనను టార్గెట్ చేసిన  వారిని మాత్రం దరిచేరనిచ్చేది లేదని చెప్పేశారు. ముకుల్ రాయ్ ఆ కేటగిరీ లోకి రారని తేల్చేశారు.

టీఎంసీ పార్టీ స్థాపన సమయంలో ముకుల్ రాయ్   కీలకపాత్ర పోషించి మమతకు వెన్నుదన్నుగా నిలిచారు . ఆయన 2017లో బీజేపీ తీర్థం పుచ్చుకున్న దగ్గరి నుంచి పార్టీలోనూ కీలకంగానే వున్నారు.  బీజేపీ అధినాయకత్వం కూడా ఆయనకు జాతీయ ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టింది.ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ముకుల్ రాయ్ కీలకంగానే వ్యవహరించారు. ఎన్నికల ముందు టీఎంసీ నుంచి వలసలను ప్రోత్సహించారు.అసెంబ్లీ ఎన్నికలబరిలో దిగి విజయం సాధించారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ కార్యకలాపాలకు కొంత దూరంగా వుంటూ వస్తున్నారు. ఇటీవల బీజేపీ కీలక నేతల సమావేశానికి ముకుల్ డుమ్మా కొట్టడంతో ఆయన తిరిగి సొంత గూటికే చేరుకుంటారన్న  వార్తలు చక్కర్లు కొట్టగా వాటిని ముకుల్ రాయ్ నిజం చేశారు.

టీఎంసీ లో తిరిగి చేరిన సందర్భంగా ముకుల్ రాయ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. బిజెపిలో ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు ఎక్కువ కాలం మనుగడ సాధించలేరని  అందర్నీ ఆశ్చర్యపరిచారు.

అయితే ముకుల్ రాయ్ అసంతృప్తికి కారణం ఏంటి... టీఎంసీ నుంచి సువేందూ అధికారి బీజేపీలో చేరినప్పటినుంచి ముకుల్ రాయ్ కు ప్రాధాన్యత తగ్గింది. అసెంబ్లీలో బీజేపీ పక్ష నాయకుడిగా పదవిని ఆశించిన ముకుల్ భంగ పడ్డారు. సువేందూ అధికారికే బిజెపి అధినాయకత్వం ప్రతిపక్ష నేత  పదవిని కట్టబెట్టింది.

మరి ఇప్పుడు ముకుల్ రాయ్ తనతోపాటు బీజేపీలో చేరిన టీఎంసీ నాయకులను తిరిగి సొంత గూటికి చేరుస్తారా… ఆ కార్యాచరణే మమతా బెనర్జీ ఈ గోల్డ్ కు అప్పగించారని చెబుతున్నారు. బీజేపీ నుంచి 30 మంది దాకా నేతలు అందులో 20 మంది ఎమ్మెల్యేలు టీఎంసీ గూటికి చేరతారన్న వార్తలు గుప్పుమంటున్నాయి.

జాతీయ రాజకీయాల్లో బీజేపీకి ఎదురొడ్డే కూటమి ఏర్పాటు లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న బెంగాల్ దీదీ ఒక వ్యూహం ప్రకారమే సొంత రాష్ట్రంలో బీజేపీ బలపడకుండా టీఎంసీ ని వీడిన నేతలను తిరిగి దారికి తెచ్చుకునే పనిలో పడ్డారు.

ఈ పరిణామాల్లో సొంతగూటికి క్యూకడుతున్న టీఎంసీ నేతలను కమలనాథులు ఎలా ఆపగలుగుతారనేది ఆసక్తి గా మారింది. అయితే ముకుల్ లాంటి వాళ్ళు పార్టీని వీడినంతమాత్రాన  తమకు వచ్చే నష్టం ఏమీ లేదు అంటున్న బిజెపి నేతలు మాత్రం ముకుల్ రాయ్ వెంట  ఒక్క బీజేపీ కార్యకర్త కూడా వెళ్లలేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరి పశ్చిమబెంగాల్ రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.

-వెలది కృష్ణకుమార్

RELATED ARTICLES

Most Popular

న్యూస్