Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

శ్రీ శ్రీ శ్రీ కైలాసనామ నూత్న ద్వీప దేశావిష్కార ధౌరేయా! క్రిమి కీటక పశు పక్ష్యాదులు మనుషుల్లా మాట్లాడే నూత్న విజ్ఞానం కనుక్కున్నానని మీరు సెలవిచ్చినప్పుడు మనుషుల మాట పడిపోయింది. మీరు కారణాంతరాల వల్ల దేశాంతరం వెళ్లి- చివరికి ఈక్వెడార్ దగ్గర కొత్త దేశాన్నే సృష్టి చేసినప్పుడు అన్ని దేశాలకు దశ దిశ లేకుండా పోయింది. మీరు బెంగళూరు సరిహద్దులనుండి రాత్రికి రాత్రి మాయమై సప్త సముద్రాలకు ఆవల ఎక్కడో చిటికెలో తేలినప్పుడే మీ మహిమాన్విత గాథలు మాకు తెలిశాయి

తాజాగా “నేను కాలు పెడితేగానీ భారత దేశంలో కరోనా పోదు” అని మీరు వాక్రుచ్చినట్లు వార్తలొచ్చాయి. ధర్మార్థ కామ మోక్షాలయిన చతుర్విధ ఫల పురుషార్థాల కోసం తపించే సగటు భారతీయుల ముందు మీరు హిమాలయమంత ధర్మసందేహ పర్వతాన్ని పెట్టారు. వేద వేదాంత ఉపనిషత్ బ్రహ్మ సూత్ర భాష్యాలను అరటి పండు ఒలిచిపెట్టినట్లు అజ్ఞానులమయిన మాకు చెప్పే మీరు- మమ్మల్ను ఇలా ధర్మ సంకటంలో ఇరికించడం బాగోలేదు.

మీరు మళ్లీ భారత్ లో కాలు పెట్టాలా?
లేక భారత్ లో కరోనా ఇలాగే ఉండాలా?
అన్న రెండు మహోపద్రవాల ముందు ఏదో ఒకటే తేల్చుకోవాలని దయచేసి మమ్మల్ను ఒత్తిడి చేయవద్దు. మీరు కాలు పెడితే కరోనా పోతుందని మీ మనస్సాక్షి మీకు గ్యారెంటీ ఇస్తే ప్రయత్నించండి. లేకపోతే మీరు కాలు పెట్టిన తరువాత కూడా కరోనా అలాగే ఉంటే…
అసలే కరోనా…ఆపై నిత్యానంద…అని మా పరిస్థితి నిత్య నరకం అవుతుంది. గోడ దెబ్బ- చెంప దెబ్బ. పెనం మీదినుండి పొయ్యిలో పడ్డట్టు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడి పోయింది అన్నట్లు మా పరిస్థితి దుర్భరంగా మారుతుందని భయపడుతున్నాం.

అయితే మొల లోతు కష్టాల్లో మోకాటి లోతు ఆనందం అన్నట్లు కరోనా వేళ మీరు మళ్లీ భారత్ లో కాలు పెడితే సంతోషించాల్సిన విషయం కూడా ఒకటి ఉంటుంది. మీరు పొద్దునా, సాయంత్రం కళ్లల్లో కాంతులు మిరుమిట్లు గొలుపుతుండగా, నిస్సంకోచంగా, నిశ్చయంగా, సాధికారికంగా తమిళ యాసలో ఇంగ్లీషులో మాట్లాడుతుంటే- మాకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వు వస్తూ ఉంటుంది. బహుశా లాఫింగ్ థెరపీ- హాస్యామృత వైద్యంతో కరోనాను నామరూపాల్లేకుండా చేయడం- మీరు కాలు పెట్టడం వల్లే జరిగేలా ఉంటే- దయచేసి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయవద్దు.

ఆనందయ్య మూలికల మందుకే అధికారికంగా అనుమతులు వచ్చాయి. న్యాయస్థానాలు కూడా సరేనన్నాయి. ఆయన ఒట్టి కృష్ణపట్నం ఆనందయ్య. మీరు కైలాస దేశ నిత్యానందయ్య. కృష్ణపట్నం కంటే కైలాసం అన్ని రకాలుగా గొప్పదే.

అయ్యా స్వామీ!
మీరు దేశం వదిలి వెళ్ళినప్పటినుండి హాస్యరసం మృగ్యమై దేశజనులు నీరసంతో మంచం పట్టి ఉన్నారు. ఈక్వెడార్ భూమధ్య రేఖల మధ్యలో నుండి నుదుట రేఖలతో స్వయంభువుగా రండి. కైలాసాన్ని నేలకు దించి, ఆ కైలాసాన్ని నడుముకు కట్టుకుని తిరుగుతున్న మీరు కైలాసాన్ని వదిలి రావాలంటే కష్టమే. కానీ పాపులమయిన మమ్మల్ను దయదలిచి మీ పాదకమల స్పర్శతో మళ్లీ భారత్ ను పునీతం చేయగలరు. మీరుంటే ఎన్ని కరోనాలయినా మమ్మల్ను ఏమీ చేయలేవు.

మీ పాద ధూళి ముందు- కోవిషీల్డ్, కొవ్యాగ్జిన్, స్పుత్నిక్ లు ఎంత?
దుర్నిరీక్షమయిన మీ అపార కృపాపారావార కరుణా కటాక్ష వీక్షణాల ముందు కరోనా ఎంత?

-పమిడికాల్వ మధుసూదన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com