గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి తెలుసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షాలకు చురకలంటించారు. రాష్ట్రంలో తానంటే గిట్టనివారు అభివృద్ధి జరగడంలేదని, ఎప్పుడూ బటన్ నొక్కి ప్రజల అకౌంట్లలో డబ్బులు వేస్తున్నాడు తప్ప అభివృద్ధి చేయడలేదని ఆరోపిస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. అలాంటి వారికి తాను ఒక్కటే చెప్పదల్చుకున్నానని తమ ప్రభుత్వం గ్రామ స్థాయిలో చేపట్టిన మార్పులు తెలుసుకోవాలని కోరారు.
- శిథిలావస్థలో ఉన్న స్కూళ్ళ రూపురేఖలు నాడు-నేడు కింద మారుస్తున్నామని
- శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో నాడు-నేడుతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని
- రైతన్నలకు తోడుగా ఉండేందుకు…వారిని చేయి పట్టుకుని నడిపించేందుకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని
- అంగన్ వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మర్చామని
- ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్ఈ సిలబస్ తో ఇంగ్లీష్ మీడియం మొదలు పెడుతున్నామని
- రాబోయే రోజుల్లో ప్రతిగ్రామానికి ఇంటర్నెట్ తీసుకువచ్చి డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయబోతున్నామని
- ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఏర్పాటు చేసి 15 మందికి ఉద్యోగాలు కల్పించామని
- ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను నియమించి సంక్షేమ పథకాలు లబ్ధిదారుడి ఇంటివద్దే అందిస్తున్నామని….
ఇది అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు.
దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ రెండేళ్లలో రైతులకు 83,600 కోట్ల రూపాయలు రైతుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టగాలిగామని గర్వంగా చెప్పగలుగుతానన్నారు.