మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ, తెరాస నాయకులు, కార్యకర్తలు పరస్పరం దాడికి దిగారు. మునుగోడు మండలం పలివెల మీదుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోకు వెళ్తున్న టీఆర్ఎస్ శ్రేణులపైనా బీజేపీ కార్యకర్తలు రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. ఈటల రాజేందర్ ఆధ్వర్యంలోనే బీజేపీ నేతలు ఈ దాడులకు తెగబడ్డారని తెరాస నేతలు ప్రతి దాడులకు దిగారు. ఒకానొక దశలో రెండు వర్గాలను అదుపు చేయటం పోలీసులకు కష్ట తరంగా మారింది. బీజేపీ శ్రేణుల రాళ్ల దాడిలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ జగదీశ్ సహా పలువురికి గాయాలయ్యాయి. ఈటల రాజేందర్ భార్య ఈటెల జమున స్వగ్రామమైన పలివెలలోనే మకాం వేసి బిజెపి తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బిజెపి, తెరాస శ్రేణుల మధ్య పలు సందర్భాల్లో వాదోపవాదాలు జరిగాయి.
సంయమనం పాటించండి : మంత్రి హరీశ్‌రావు
ఓటమి భయంతోనే బీజేపీ.. టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇలాంటి సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలవబోతుందని తెలిసి బీజేపీ నిరాశ, నిస్పృహతో ఇలాంటి కుట్రలకు చేస్తుందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
Also Read : కిషన్‌రెడ్డి, బండివి నకిలీ మాటలు.. వెకిలి చెష్టలు: మంత్రి హరీశ్ రావు