ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యుడు, వైఎస్సార్సీపీ నేత చల్లా భగీరథరెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయస్సు 46 సంవత్సరాలు. భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజులుగా ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఈ మధ్యాహం పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
కర్నూలుజిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత చల్లా రామకృష్ణా రెడ్డి వారసుడిగా భగీరథ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. 2020 డిసెంబర్ 31న రామకృష్ణారెడ్డి అనారోగ్యంతో మరణించడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని అయన తనయుడు భగీరథ రెడ్డికే సిఎం జగన్ కేటాయించారు.
రేపు అవుకులో అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. భగీరథ రెడ్డి మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.