ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కొద్ది సేపటి క్రితం కలిసిన తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్ రమణ. ఎల్ రమణను ప్రగతిభవన్ కు తీసుకువచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. త్వరలో టీఆర్ఎస్ లో చేరనున్న ఎల్ రమణ. రెండు రోజులుగా ఉత్తర తెలంగాణలో పర్యటిస్తున్న మంత్రి దయాకర్ రావు ఈ రోజు ఉదయం జగిత్యాలలో వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా నేతలతో ఎల్ రమణ చేరికపై చర్చించిన ఎర్రబెల్లి అందరి అభిప్రాయలు సేకరించారు.
కెసిఆర్ తో సమావేశం వివరాల్ని ఎల్ రమణ మీడియాకు వెల్లడించారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో వెళ్లి కలిసినట్టు ఎల్ రమణ వెల్లడించారు. సిఎం తో జరిగిన సమావేశంలో వివిధ అంశాలు చర్చకు వచ్చాయన్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మారుతున్న రాజకీయ పరిణామాలపై చర్చ జరిగిందన్నారు. సామాజిక తెలంగాణ కోసం ముందుకు వెళ్లాలన్న ఆలోచనను కేసీఆర్ చెప్పారని ఎల్ రమణ తెలిపారు. తనతో పాటు సామాజిక తెలంగాణ కోసం కలసి రావాలని కోరారు. టిఆర్ఎస్ పార్టీలోకి రావాలని సిఎం కెసిఆర్ ఆహ్వానించారన్న ఎల్ రమణ తన నిర్ణయం సానుకూలంగా ఉంటుందని చెప్పినట్టు వివరించారు.
ఎల్ రమణ అంటే కేసీఆర్ కు మొదటి నుంచి అభిమానమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. చేనేత కుటుంబం నుంచి వచ్చిన రమణ సహకారం టిఆర్ఎస్ కు అవసరమన్నారు. చేనేత వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టిందని, ఇంకా చేయాల్సి ఉందని మంత్రి చెప్పారు. రమణను టిఆర్ఎస్ రావాలని కేసీఆర్ ఆహ్వానించారని, రమణ సానుకూలంగా స్పందించారని ఎర్రబెల్లి వెల్లడించారు. నేను, రమణ ఒకరికొకరం శ్రేయోభిలాషులమన్న ఎర్రబెల్లి దయాకర రావు తెలంగాణలో టిడిపి నిలదోక్కుకునే పరిస్థితి లేదన్నారు.