రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్య సభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను అయన కలుసుకున్నారు. రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన నదీ జలాల వివాదాన్ని అయన దృష్టికి తీసుకెళ్ళారు. వెంటనే జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. తెలంగాణా ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు, విద్యుత్ ఉత్పత్తిపై కూడా షెకావత్ కు ఫిర్యాదు చేశారు.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిను వెంటనే నోటిఫై చేయాలని కేంద్రమంత్రిని కోరినట్లు విజయ సాయి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, కేఆర్ఎంబి పరిధిలోని ప్రాజెక్టులకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు అనర్హత పిటిషన్ పై ఏడాది గడుస్తున్నా ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేదని విజయసాయిరెడ్డి అసంతృప్తి చేశారు. తమ ఫిర్యాదును సభాహక్కుల ఉల్లంఘన కమిటీకి పంపుతామని స్పీకర్ చెప్పారని, అయన పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. అనర్హత పిటిషన్ పై నిర్ణయం తీసుకునే విషయంలో ఆలస్యం చేయవద్దని సుప్రీం కోర్టు కూడా తీర్పు చెప్పినందున, తమ ఫిర్యాదుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో పార్లమెంటు సమావేశాల్లో నిరనస తెలుపుతామని స్పష్టం చేశారు.