నందిగామలో జరిగిన సంఘటన చంద్రబాబు కుట్రలో భాగమేనని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. రాళ్ళు విసిరించుకోవడం బాబుకు నరనరాల్లో జీర్ణించుకున్న విషపు రాజకీయ కుట్రలో ఒక కోణమని పేర్కొన్నారు. రాయి విసిరింది పుసుపు పార్టీ వ్యక్తే అయి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ నాటకానికి ప్రేరేపించిన చంద్రబాబు తన సిఎస్ఓకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ కార్యకర్తలు రాళ్ళు వేశారంటూ బాబు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ వెళ్లాలని, వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న 151 స్థానాలు 175 కు చేరాలని తాము కృషి చేస్తుంటే.. బాబుపై రాళ్ళు వేయాల్సిన వేయాల్సిన అవసరం, ఖర్మ మాకెందుకని ప్రశ్నించారు. చంద్రబాబే విధ్వంసకారి అని, ఇలాంటి బుద్ధులు ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని అభివర్ణించారు.
నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ ఇంటిపై రెక్కీ, రెక్కీ అంటూ ఆందోళన చేశారని, దానిపై టిడిపి నేతలు వరుస ప్రెస్ మీట్ లు పెట్టి విమర్శలు చేశారని, తీరా చూస్తే… అక్కడ జరిగింది తాగుబోతుల గొడవగా తెలంగాణ పోలీసులు తేల్చారని జోగి పేర్కొన్నారు. నేడు రాయి దాడి అంటూ మరో గోల మొదలు పెట్టారని దుయ్యబట్టారు. రెండు పార్టీలూ కూడబలుక్కొని డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. రేపు మళ్ళీ పవన్ విప్పటం టూర్ పెట్టుకున్నారని, రోడ్డు విస్తరణలో భాగంగా ఆ గ్రామంలో రోడ్లు విస్తరిస్తున్నారని, అందరూ స్వచ్చందంగా ముందుకు వస్తున్నా సరే రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : చంద్రబాబు కాన్వాయ్ పై దాడి: సిఎస్వో కు గాయాలు