ఇడుపులపాయలో హైవే వేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడం ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లుందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. బాబు, పవన్ కళ్యాణ్ లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలనుంచి సిఎం జగన్ ను విడదీయలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటంలో మొదటి విడత రోడ్ల విస్తరణకు టెండర్లు పిలిచి పనులు కూడా పూర్తయ్యాయని, ఆ సమస్యపై పవన్ ఇప్పుడు ఆందోళన చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రస్తుతం డ్రైనేజ్ నిర్మాణంలో భాగంగా కొన్ని ప్రహరీ గోడలు మాత్రమే కూల్చి వేశారని, ఎక్కడా ఒక్క ఇల్లు కూడా కూల్చలేదని స్పష్టం చేశారు. అక్కడ ఏదో ఒక కులానికో, పార్టీకో అన్యాయం జరిగినట్లు పవన్ చిత్రీకరించడం సరికాదన్నారు. మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ విగ్రహాలను కూల్చలేదని, వాటిని భద్రపరిచారని, త్వరలో వాటిని పునః ప్రతిష్టిస్తారని మంత్రి వెల్లడించారు. పవన్ ను పిచ్చి కళ్యాణ్ గా అభివర్ణించారు. ప్రతిపక్షాల కుట్రల్లో మొదటిది పవన్ పై రెక్కీ అని, రెండోది నిన్న రాయి దాడి అని, మూడోది పవన్ విప్పటం పర్యటన అని జోగి పేర్కొన్నారు.
ఎవరు ఎంతమంది కలిసినా జగన్ ప్రభుత్వాన్ని ఒక్క ఇంచ్ కూడా కదిలించలేరన్నారు. తాము చేస్తున్న మంచి పనులను ఓర్చుకోలేక ఇలాంటి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడినుంచో జనాన్ని తీసుకెళ్ళి పవన్ అక్కడ రెచ్చగొడుతున్నారని అన్నారు. పవన్ టూర్ పై ఇప్పుడు మళ్ళీ బాబు ట్వీట్ పెట్టారని, అసలు కూల్చివేతలపై మాట్లాడే హక్కు బాబుకు ఉందా అని జోగి ప్రశ్నించారు. పుష్కరాల సమయంలో బాబు ప్రభుత్వం చేసిన కూల్చివేతలు చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. ఎన్నో దేవాలయాలు, విగ్రహాలు కూడా కూల్చారన్నారు. ప్రభుత్వాన్ని కూల్చి వేస్తామంటూ బాబు, పవన్ లు చెబుతున్నారని, కానీ అది ఎప్పటికీ వారికి సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఆ రెండు పార్టీలూ విడివిడిగా ఉండాల్సిన అవసరం ఏముందని, కలిసిపోవచ్చుగా అంటూ వ్యాఖ్యానించారు.
ఇప్పటంలో కేవలం జనసేన, తెలుగుదేశం పార్టీకి చెందిన వారి ఇళ్లు మాత్రమే కూల్చి వేశారంటూ ఓ దినపత్రికలో వచ్చిన వార్తలపై కూడా జోగి రమేష్ తీవ్రంగా ధ్వజమెత్తారు.
Also Read : ఇడుపులపాయలో హైవే వేస్తాం: పవన్