ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సమర్థిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం బీసీ జన గణన ఆవశ్యకతను నొక్కి చెబుతోందని టీ ఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవ రావు అన్నారు. ఏ వర్గం నష్ట పోకుండా ఉండాలంటే బీసీ జన గణన అనివార్యంగా జరుగాల్సిందేనన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పించడానికి 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటును సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమర్థించటంపై కేశవ రావు స్పందించారు.
తెలంగాణ శాసన సభ బీసీ జన గణన పై చేసిన తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకుని వెంటనే కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కేశవ రావు డిమాండ్ చేశారు. బీసీ జనగణన జరిగితే వివిధ కులాలకు ఖచ్చితమైన రిజర్వేషన్ శాతాలు నిర్ణయించవచ్చన్నారు. సుప్రీం తీర్పుతోనైనా కేంద్రం తన వైఖరి మార్చుకుని బీసీ గణన చేపట్టాల డాక్టర్ కె. కేశవ రావు హితవు పలికారు.