మంగళగిరి నియోజక వర్గంలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్ల కూల్చివేతకు గురైన బాధితులకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మొత్తం 53 మంది బాధితులకు ఈ సాయాన్ని అందించనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల సంఘం ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో తెలియజేశారు.
ఈ ఏడాది మార్చి 14న జరిగిన జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారన్న కోపంతోనే ఆ గ్రామంపై కక్ష పెంచుకొని రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్లు కూల్చి వేశారని జనసేన ఆరోపిస్తోంది. గత శనివారం పవన్ కళ్యాణ్ ఈ గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. నైతిక మద్దతుతో పాటు ఆర్ధికంగా కూడా అండగా నిలబడాలన్న ఉద్దేశంతోనే ఈ భరోసా సాయాన్ని ప్రకటించారని, త్వరలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ సాయాన్ని బాధితులకు అందజేశారని మనోహర్ వెల్లడించారు.