పాకిస్తాన్ జట్టు పురుషుల టి20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో అడుగు పెట్టింది. న్యూజిలాండ్ తో నేడు జరిగిన సెమీ ఫైనల్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బౌలింగ్ లో కివీస్ ను 152 పరుగులకే కట్టడి చేసిన పాక్ ఈ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి వికెట్ కు పాకిస్తాన్ 105 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ అజామ్ 42 బంతుల్లో 7 ఫోర్లతో 53; రిజ్వాన్ 43 బంతుల్లో 5 ఫోర్లతో 57 పరుగులు చేసి ఔటయ్యారు. మహమ్మద్ హారిస్ 30 పరుగులు చేసి 19వ ఓవర్ చివరి బంతికి వెనుదిరిగాడు. చివరి ఓవర్లో రెండు పరుగులు అవసరంకాగా మొదటి బంతి వైడ్, రెండో బంతిని మసూద్ ఒక పరుగు తీసి మరో ఐదు బంతులు ఉండగానే విజయం అందించాడు.
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో కివీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి ఓవర్లోనే ఫిన్ అల్లెన్ (4)ను షాహీన్ ఆఫ్రిది ఎల్బీగా ఔట్ చేశాడు. 38 పరుగుల వద్ద మరో ఓపెనర్ కాన్వే(21) రనౌట్ గా వెనుదిరిగాడు. మంచి ఫామ్ లో ఉన్న గ్లెన్ ఫిలిప్స్(6) ను నవాజ్ రిటర్న్ క్యాచ్ తో వెనక్కి పంపాడు. కెప్టెన్ విలియమ్సన్ –డెరిల్ మిచెల్ లు నాలుగో వికెట్ కు 68 పరుగులు జోడించారు. విలియమ్సన్ 42 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ తో 46 స్కోరు చేసి ఔటయ్యాడు.
మిచెల్-53(35 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్); నీషమ్-16 పరుగులతో క్రీజులో నిలిచారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో షాహీన్ ఆఫ్రిది రెండు; నవాజ్ ఒక వికెట్ సాధించారు. భారీ షాట్ లు ఆడకుండా కివీస్ ప్లేయర్లను పాకిస్తాన్ ఫీల్డర్లు నిలువరించగలిగారు. కివీస్ తన ఇన్నింగ్స్ లో కేవలం 10 ఫోర్లు, 2 సిక్సర్లు మాత్రమే సాధించింది.
రిజ్వాన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.