Saturday, November 23, 2024
HomeTrending Newsమొన్న దత్తపుత్రుడు, నేడు సొంత పుత్రుడు

మొన్న దత్తపుత్రుడు, నేడు సొంత పుత్రుడు

గృహ నిర్మాణంపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి  జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పేదలకు కనీసం ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేకపోతే ప్రశ్నించని వారు, తాము 31 లక్షల 20వేల మంది అక్క చెల్లెమ్మలకు  ఇళ్లస్థలాలు ఇచ్చి వాటిలో మొదటి, రెండు దశల్లో 21 లక్షల ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుడితే ఆ మీడియాకు కళ్ళు కనబడడం లేదా అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

రాక్రీట్ తో పాటు 353 సంస్థలు ఇళ్ళ నిర్మాణంలో భాగస్వాములం అవుతామని ముందుకు వస్తే అదేదో పెద్ద స్కామ్ లాగా చిత్రీకరించడంపై మంత్రి రమేష్ మండిపడ్డారు. ఓ వైపు ఇళ్ళ నిర్మాణం జరగడంలేదని విమర్శలు చేస్తున్నాయని, మరోవైపు ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసేందుకు కొన్ని సంస్థలు ముందుకు వస్తే చెత్త వార్తలు రాస్తున్నరంటూ అసహనం వ్యక్తం చేశారు. బాబు ఏమీ చేయకపోయినా ప్రశ్నించని వారికి ఇప్పుడు ఎందుకు అంత కడుపు మంట అని ప్రశ్నించారు.  రాక్రీట్ సంస్థ  మూడో దశలో కేవలం 61,425 ఇల్లు మాత్రమే చేపడుతోందని, వివరాలు తెలియకుండానే విషపు రాతలు రాస్తున్నారని అన్నారు. సదరు మీడియా సంస్థ యజమానికి సంబంధించిన సంస్థ కూడా ముందుకు వచ్చి ఇళ్ళ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతామంటే పని అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని జోగి వెల్లడించారు.  ఇళ్ళ నిర్మాణంపై వాస్తవాలు తెలుసుకునేందుకు క్షేత్ర స్థాయి పరిశీలనకు రావాలని సవాల్ చేశారు.

ఇప్పటం గ్రామంలో ఒక్క ఇల్లు కూడా కూల్చలేదని, సెంటు భూమిని కూడా సేకరణ ద్వారా తీసుకోలేదని, రోడ్ల విస్తరణలో ఆయా ఇళ్ళ ప్రహరీ గోడలు అడ్డు వస్తే మాత్రమే తొలగించామని జోగి రమేష్ వివరణ ఇచ్చారు. సొంత పుత్రుడు ఓడిపోయిన నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామానికి, రెండు చోట్ల ఓడిపోయిన దత్త పుత్రుడిని పర్యటనకు పంపారని… ఇటీవలి పవన్ పర్యటనపై జోగి ఎద్దేవా చేశారు. మొన్న పవన్ షో అయిపోయిందని, ఈరోజు లోకేష్ పర్యటన పెట్టుకున్నారని విమర్శించారు.  పవన్ ఇప్పటం పర్యటనకు వెళ్ళినప్పుడు హీరోయిజం ప్రదర్శిస్తూ కారుపై కూర్చొని వెళ్ళారని, ఇలాంటివి సినిమాల్లో అయితే బాగుంటాయని హితవు పలికారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్