నిన్న నేపాల్ లో భూకంపం తర్వాత ఈ రోజు అరుణాచల్ ప్రదేశ్ లో భారీ భూకంపం సంభవించింది. ఈ రోజు ఉదయం భూకంపం వచ్చింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.7గా నమోదైంది. భూకంపం రావడంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలో నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
పశ్చిమ సియాంగ్ జిల్లాలో ఈ రోజు ఉదయం 10.31 గంటలకు వచ్చిన భూకంపం పది కిలోమీటర్ల డెప్త్ తో వచ్చిందని సిస్మోలోజి శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. మొదటి భూకంపం వచ్చిన కొద్ది సేపటికే మరోసారి భుప్రకపంపణలు సంభవించాయి. రెండో దఫా వచ్చినపుడు రిక్టర్ స్కేల్ పై 3.5గా నమోదైంది. రెండో దఫా భూకంపం కూడా పశ్చిమ సియాంగ్ జిల్లాలోనే చోటు చేసుకోవటం గమనార్హం.
మరోవైపు అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా భూకంపం వచ్చింది. ఈ రోజు వేకువ జామున 2.29 గంటలకు వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్ పై 4.3 గా నమోదైంది. అండమాన్ రాజధాని పోర్ట్ బ్లెర్ కు ఈశాన్య దిశలో 253 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ప్రకంపనలు సంభవించాయి.