రాష్టంలోని అన్ని జిల్లాల్లో 3450 కోట్ల రూపాయలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. దీనిద్వారా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీనితో పాటుగా 33 వేల మందికి ఉదోగ్యావకాశాలు లభిస్తాయని చెప్పారు. 26 జిల్లాల్లో… మొదటి దశలో 10 యూనిట్లను 1250 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని, రాబోయే రెండు నెలల్లో వీటికి శంఖుస్థాపన చేయబోతున్నామని వివరించారు.
పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు సమీపంలో ఐటిసి ఏర్పాటు చేసిన స్పైసెస్ పార్క్ మొదటి దశ పనులను సిఎం జగన్ నేడు ప్రారంభించారు. ఐటిసి ఛైర్మన్ సంజయ్ పూరిని జగన్ అభినందించారు. ఐటిసి గ్లోబల్ స్పైస్ ప్లాంట్ తో రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. 200 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏటా 20వేల మెట్రిక్ టన్నుల మిర్చి, సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి ఎగుమతి చేసేందుకు ఈ ప్లాంట్ తోడ్పడుతుందన్నారు. మొత్తం 15 రకాల సుగంధ ద్రవ్యాలు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయన్నారు. రెండో దశ విస్తరణ కూడా పూర్తయితే దేశంలోనే కాకుండా ఆసియాలోనే ఇది అతిపెద్ద ప్లాంట్ అవుతుందని చెప్పారు. దీనిద్వారా 1500మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. 14వేల మంది రైతులకు ఈ ప్లాంట్ ఓ గొప్ప వరమని పేర్కొన్నారు. నవంబర్ 2020లో నిర్మాణం మొదలైన ఈ ప్లాంట్ రెండేళ్ళలోనే తమ కార్యకలాపాలు మొదలయ్యాయని ప్రశంసించారు. గత మూడేళ్ళుగా ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ దేశంలోనే మొదట స్థానంలో నిలుస్తున్నామన్నారు.